Begin typing your search above and press return to search.

హరీశ్ నోట ‘రాజీనామా’ సవాల్

By:  Tupaki Desk   |   28 Jan 2016 4:45 AM GMT
హరీశ్ నోట ‘రాజీనామా’ సవాల్
X
తెలంగాణ అధికారపక్షంలో ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించటంతో పాటు.. సమస్యల్ని పరిష్కరించటంతో తనదైన మార్క్ ను ప్రదర్శించే గులాబీ నేత మంత్రి హరీశ్ రావు. సమయం.. సందర్భం ఏదైనా టీఆర్ ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన ఆయన తన సత్తాను చాలా సందర్భాల్లో ప్రదర్శించారు. తాజాగా నారాయణఖేడ్ ఉపఎన్నిక బాధ్యతల్ని మోస్తున్న ఆయన.. గెలుపు మీద ధీమా వ్యక్తం చేయటమే కాదు.. తేడా వస్తే రాజీనామాకు సిద్ధమని తేల్చి చెప్పటం గమనార్హం

నారాయణఖేడ్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావటం.. ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్న టీఆర్ ఎస్ సర్వశక్తుల్ని ఒడ్డుతూ పావులు కదుపుతోంది. ఉప ఎన్నికలో విజయం ద్వారా తెలంగాణలో తన సత్తా చాటాలని తపిస్తున్న కేసీఆర్ ఆలోచనల్ని వాస్తవరూపంలోకి తీసుకొచ్చేందుకు ఆయన మేనల్లుడు హరీశ్ రంగంలోకి దిగటం తెలిసిందే.

నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో విజయం తమదేనని తేల్చి చెబుతున్న హరీశ్.. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ.. తేడా వస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పటం ద్వారా నారాయణఖేడ్ లో గెలుపు ఎవరన్న విషయంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి రాజీనామా సవాళ్లు మాత్రమే వింటే.. తాజాగా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లోనూ రాజీనామా సవాళ్లు మొదలయ్యాయి. మరి.. హరీవ్ సవాల్ కు ప్రతిసవాల్ చేసే ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.