Begin typing your search above and press return to search.

ద‌మ్ము పేరు చెప్పి దెబ్బేస్తార‌ని తెలుసులే హ‌రీశ్‌!

By:  Tupaki Desk   |   26 May 2017 5:08 AM GMT
ద‌మ్ము పేరు చెప్పి దెబ్బేస్తార‌ని తెలుసులే హ‌రీశ్‌!
X
మిగిలిన రాజ‌కీయ పార్టీల‌తో పోలిస్తే.. తెలంగాణ అధికార‌ప‌క్షం కాస్త భిన్న‌మైంది. ఉద్య‌మ పార్టీగా అనేక ఆటుపోట్లు ఎదుర్కోవ‌టం.. త‌మ ఉనికి కోసం ఆ పార్టీ నేత‌లు వినిపించే భావోద్వేగ మాట‌లు ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌మ వాద‌న‌తో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించేందుకు గులాబీ నేత‌ల మాట‌లు కాస్త చిత్రంగా ఉంటాయి.

ఘ‌న‌త‌ల‌న్నీ త‌మ ఖాతాలో వేసేసుకునే ఆ పార్టీ.. త‌మ‌కు చేత‌కాని వాటిని తమ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు తెలివిగా అంట‌క‌డుతుంటాయి. అధికారంలో ఉండ‌టం.. అసాధ్యాల్ని సుసాధ్యాల్ని చేయ‌టం త‌మ‌కు చాలా అల‌వాటైన ప్ర‌క్రియ‌గా చెప్పుకునే గులాబీ నేత‌లు.. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతుంటారు. నిజానికి ఈ అల‌వాటు వారికి ఇప్పుడే వ‌చ్చింది కాదు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి ఉన్న‌దే.

ద‌మ్ము పేరుతో దెబ్బేసే ఈ కొత్త త‌ర‌హా రాజ‌కీయం.. టీఆర్ఎస్ నేత‌ల అమ్ముల పొదిలో తిరుగులేని అస్త్రంగా చెప్పాలి. తాము సాధించ‌లేని వాటిని తెలివిగా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు బ‌దిలీ చేస్తుంటారు. మ‌రి.. వాటిని కానీ ప్ర‌త్య‌ర్థి పార్టీలు సాధిస్తే.. అలా సాధించేలా చేసిన ఘ‌న‌త త‌మ సొంత‌మ‌ని.. కాబ‌ట్టి క్రెడిట్ మొత్తం త‌మ‌కే కావాల‌ని డిమాండ్ చేస్తారు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న విష‌యంలో ఇదే త‌ర‌హా ప్లానింగ్ తో మిగిలిన రాజ‌కీయ ప‌క్షాల్ని దెబ్బేసిన టీఆర్ఎస్ నేత‌లు.. తాజాగా బీజేపీ నేత‌ల‌పై మ‌రోసారి ద‌మ్ము అస్త్రాన్ని సంధించే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన బ‌కాయిల్ని.. డిమాండ్ల‌ను ద‌మ్ముంటే.. కేంద్రం నుంచి తీసుకురావాల‌న్న‌మాట‌ను చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ద‌మ్ముంటే కేంద్రం నుంచి రావాల్సిన రూ.10 వేల కోట్ల సీఎస్టీ బ‌కాయిల్ని విడుద‌ల చేయించాల‌ని.. రూ.1400 కోట్ల‌ తెలంగాణ కాంపా నిధులు తిరిగి ఇప్పించాల‌ని.. వెంట‌నే హైకోర్టు విభ‌జ‌న చేయించాల‌ని డిమాండ్ చేశారు.

త‌మ‌కు సాధ్యం కాని వాటిని చేయించాల‌ని డిమాండ్ చేసే గులాబీ నేత‌లు.. వాటన్నింటిని తీసుకొస్తే.. అధికారాన్ని త‌మ‌కు ఇచ్చేస్తారా? త‌మ‌ది చేత‌కాని పాల‌న అని ఒప్పుకుంటారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేత‌లు. అన్ని అంద‌రూ చేసేట‌ట్లైయితే.. తెలంగాణ అధికార‌ప‌క్షం చేసేదేమిటి? త‌మ‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను తిట్టిపోయ‌ట‌మా? అని ప్ర‌శ్నిస్తున్నారు. పాలించే అధికారాన్ని ఇవ్వ‌ట‌మే కాదు.. త‌మ‌కు మించిన స‌మ‌ర్థ‌త మ‌రెవ‌రికీ లేద‌ని త‌ర‌చూ గొప్ప‌లు చెప్పుకునే టీఆర్ఎస్ నేత‌లు.. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని సాధించే విష‌యంలో వారి స‌మ‌ర్థ‌త ఎక్క‌డికి పోయింద‌న్న ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. గ‌తంలో మాదిరి ద‌మ్ము పేరిట మాట‌లు చెప్పి.. త‌మ‌ను దెబ్బేయాలంటే కుద‌ర‌ద‌ని తెలంగాణ బీజేపీ నేత‌లు తేల్చి చెబుతున్నారు. చూస్తుంటే..గులాబీ నేత‌ల వ్యూహాన్ని క‌మ‌ల‌నాథులు బాగానే స్ట‌డీ చేసిన‌ట్లు క‌నిపిస్తున్న‌ట్లు లేదూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/