Begin typing your search above and press return to search.

దీక్ష చేసుకున్నా తప్పేనంటున్న హరీశ్‌

By:  Tupaki Desk   |   24 May 2015 5:05 AM GMT
దీక్ష చేసుకున్నా తప్పేనంటున్న హరీశ్‌
X
విభజన జరిగి ఏడాది అవుతున్న నేపథ్యంలో.. విభజన జరిపిన తీరు సరిగా లేదంటూ ఏపీ సర్కారు జూన్‌ రెండో తేదీన నిరసన దీక్ష చేయాలని నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా.. ఉద్యోగులు.. విద్యార్థులు.. ఉపాధ్యాయులు అరగంటసేపు దీక్ష చేయాలని నిర్ణయించటం తెలిసిందే.

ఏపీ సర్కారు నిర్వహించనున్న దీక్షపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చేపడుతున్న నిరసన దీక్షలపై తెలంగాణ తెలుగుదేశం నేతలు ఏం సమాధానం చెబుతారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. నిరసన ర్యాలీలకు పిలుపు ఇవ్వటం చూస్తుంటే.. తెలంగాణ రావటం చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదని.. తెలంగాణ వచ్చి ఏడాది అవుతున్నా ఆయనలో ద్వేషం తగ్గలేదంటూ కొత్త రాగం వినిపిస్తున్నారు.

హరీశ్‌రావు తాజా వ్యాఖ్యలు చూస్తే.. ఏపీ అవసరాలు.. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి కూడా ప్రశ్నించకూడదన్నట్లుగా హరీశ్‌ తీరు ఉంది. ఏపీ విభజన సహేతుకంగా లేదన్న చంద్రబాబు వాదన కేవలం ఏపీ ప్రజలను ఉద్దేశించిందే తప్పించి.. తెలంగాణ ప్రజలకు.. ప్రజానీకానికి వ్యతిరేకించింది కాదన్న విషయం తెలిసినప్పటికీ.. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేయటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

నిజంగా రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబుకు ఇష్టం లేదని అనుకుంటే.. విభజన అయిపోయిన తర్వాత కూడా వ్యతిరేకత ప్రదర్శించటం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. అలాంటప్పుడు.. తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు బాబుకు రాజకీయంగా ఎంత డ్యామేజ్‌ చేస్తాయో తెలియంది కాదు.

ఆ మాటకు వస్తే.. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరుగుతుందని బాహాటంగా తెలిసినప్పటికీ.. ఏనాడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్య చేయని చంద్రబాబుపై విమర్శలు చేయటం హరీశ్‌కు మాత్రం చెల్లింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మొట్టమొదటగా సానుకూలంగా స్పందించి.. తీర్మానం చేసింది తెలుగుదేశం పార్టీనే అన్న విషయాన్ని మర్చిపోలేం.

నిజంగా చంద్రబాబుకు.. తెలంగాణ వ్యతిరేకత ఉండి ఉంటే.. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయకుండా బలంగా విభజన వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించి ఉంటే.. మిగిలిన రాజకీయ పక్షాలు ఆ బాటలో నడిచేవా? చూస్తుంటే.. ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేయటం కూడా హరీశ్‌కు ఇష్టం లేనట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.