Begin typing your search above and press return to search.

స‌త్తా మాట‌లు మీరెలా చెబుతారు హ‌రీశ్‌?

By:  Tupaki Desk   |   20 Sep 2018 6:09 AM GMT
స‌త్తా మాట‌లు మీరెలా చెబుతారు హ‌రీశ్‌?
X
గ‌డిచిన గ‌తాన్ని.. దాటొచ్చిన రోజుల్ని రాజ‌కీయ నాయ‌కులు మ‌ర్చిపోవ‌చ్చు కానీ ప్ర‌జ‌లు మ‌ర్చిపోర‌న్న విష‌యాన్ని అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. గ‌తం చ‌రిత్ర‌లో భాగ‌మ‌ని.. అది ప‌క్కాగా రికార్డ్ అయి ఉంటుంద‌న్న చారిత్ర‌క స‌త్యాన్ని మ‌రిస్తే.. ప్ర‌జ‌లు మ‌రోలా తీర్పు ఇస్తారు. గ‌డిచిన కొంత‌కాలంగా పార్టీ త‌ర‌ఫున మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా ఓ ప‌క్క‌న పెట్టేశార‌న్న మాట తాజా మాజీ మంత్రి.. ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ విష‌యంపై హాట్ హాట్ గా చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో హ‌రీశ్ పాత్ర‌ను నామ‌మాత్రం చేసే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి వేళ‌.. సిద్దిపేట‌లోని కొచ్చ‌గుట్ట‌ప‌ల్లి.. చిన్న కోడూరు త‌దిత‌ర గ్రామాల్లో హ‌రీశ్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత‌.. తెలంగాణ ఉద్య‌మ‌నేత కోదండం మాష్టారి గురించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌జ‌ల్ని ఏకం చేసింది సీఎం కేసీఆరేన‌ని చెప్పిన ఆయ‌న‌.. కోదండరాంను ద‌గ్గ‌ర‌కు తీసిన కేసీఆర్ పుణ్యంగానే ఆయ‌న‌కు బ‌లం వ‌చ్చింద‌న్న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. త‌న బ‌లం గురించి కోదండం స‌రిగా అంచ‌నా వేసుకోకుండా.. కేసీఆర్ అండ‌తో వ‌చ్చిన బ‌లాన్ని త‌న బ‌లంగా భావించ‌టం త‌ప్పున్నారు.

నిజంగానే కోదండం మాష్టారికి బ‌లం ఉంటే.. కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నార‌ని ప్ర‌శ్నించిన హ‌రీశ్‌.. నిజంగా అంత బ‌ల‌మే ఉంటే ఒంట‌రిగా పోరాడాల‌ని ఎద్దేవా చేశారు. ఒక‌ట్రెండు సీట్ల కోసం గాంధీ భ‌వ‌న్ చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ట్లుగా హ‌రీశ్ ఎట‌కారం ఆడారు. కోదండం మాష్టార్ని అన్నేసి మాట‌లు అంటున్న హ‌రీశ్ రావు.. 2004.. 2009 ఎన్నిక‌ల వేళ పొత్తుల కోసం టీఆర్ఎస్ ఎంత పాకులాడింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

తెలంగాణ ఉద్య‌మాన్ని తామే నిర్మించామ‌ని.. తెలంగాణ‌ను ఏక‌తాటి మీద తీసుకొచ్చామ‌ని చెప్పే కేసీఆర్‌.. నిజంగానే 2004.. 2009ల‌లో పొత్తులు కానీ పెట్టుకొని ఉండ‌ని ప‌క్షంలో.. ఆ పార్టీ ఉనికి ఉండేదా? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. గ‌డిచిపోయిన కాలాన్ని మ‌ర్చిపోయి.. కోదండం మాష్టార్ని అన్నేసి మాట‌లు అన‌టం వ‌ల్ల న‌ష్ట‌మే త‌ప్పించి లాభం ఉండ‌దంటున్నారు. ఎంత ఎన్నిక‌లు అయితే మాత్రం.. విమ‌ర్శ‌లు చేసే వ్య‌క్తిని చూసుకోకుండా అడ్డ బ్యాటింగ్ మాదిరి విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తే.. హ‌రీశ్ మీద గౌర‌వం త‌గ్గిపోతుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తిస్తే బాగుంటుందంటున్నారు. హ‌రీశ్‌.. ఇలాంటి సూచ‌న‌లు మీ వ‌ర‌కూ వ‌స్తున్నాయా?