Begin typing your search above and press return to search.
మామ త్వరలో గుడ్ న్యూస్ చెప్తాడంటున్న హరీశ్
By: Tupaki Desk | 22 Jan 2017 6:06 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నారని ఆయన మేనల్లుడు రాష్ట్ర నీటిపారుదల - శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి హరీష్ రావు చెప్పారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల విషయంలో త్వరలో ప్రకటన ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు - నాయకుల పదవులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలతో చర్చించి జాబితాలు రెడీ చేసి పెట్టుకున్నారని, మంచి రోజు చూసుకుని.. కార్యకర్తలకు పండుగ లాంటి ప్రకటన ను త్వరలో చేస్తారని అన్నారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని హరీశ్ వివరించారు.
దేశ చరిత్రలోనే తొలిసారి 18రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సభ నిర్వహించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని హరీశ్ రావు అన్నారు. ఇరు సభల విజయవంతాన్ని దేశమంతా హర్షిస్తోంది. సభలు జరిగిన తీరుపై ప్రజలు ఆనందంగా ఉన్నారు. సభలో విపక్షానికి సరైన అవకాశం ఇవ్వలేదని, కీలక అంశాలపై సమాధానం దాటవేశారని విపక్షాలు విమర్శిస్తుండటంలో అర్థం లేదని హరీశ్ రావు తెలిపారు. మునుపెన్నడూ లేని రీతిలో 15అంశాలపై చర్చ చేపట్టామని వివరించారు. ప్రతిపక్షాలు కోరిన ప్రతి అంశాన్ని చర్చకు స్వీకరించామని తెలిపారు. నోట్లరద్దుపై చర్చ అంటే.. రెడీ అన్నామని - ఫీజు రీయింబర్స్ మెంట్ - శాంతి భధ్రతలు - డబుల్ బెడ్రూం ఇండ్లు - మైనార్టీ సంక్షేమం ఇలా ఎందులోనూ వెనక్కుపోలెదని తెలిపారు. ఆయా అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో చేసిన ప్రకటనలతో, అన్ని వర్గాల సంక్షేమానికి చేసింది వివరంగా తెలిసిందని అన్నారు. విపక్షాలు ఇన్ని రోజులు మాట్లాడిన మాటలన్నీ అసత్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అంకెలతో నిరూపించడంతో విపక్షాలకు ఎజెండా లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు ప్రజల్లోకెళ్ళి ముఖం చూపే పరిస్థితి లేదని హరీశ్ రావు అన్నారు. చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న పార్టీ పదవుల భర్తీపై ముహూర్తం త్వరలోనే ఉంటుందని హరీశ్ రావు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎంతో కసరత్తు చేసి జాబితా రెడీ చేసి పెట్టుకున్నారని మంచి రోజు చూసుకుని కార్యకర్తలకు పండుగ లాంటి ప్రకటన త్వరలో చేస్తారని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా...శాసనసభలో విపక్షాలకు సమయం ఇవ్వకుండా సభా నాయకుడు కే చంద్రశేఖరరావు, ఆయన అల్లుడు హరీశ్‌రావు, కొడుకు కేటీఆర్ సభలో ఎక్కువ సమయం తీసుకున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇతర మంత్రులకు కూడా సభలో మాట్లాడే సమయం ఇవ్వలేదన్నారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌తోపాటు ఆయన మిత్రులైన ఎంఐఎం, బీజేపీ సభ్యులు కలిపి 18 రోజుల్లో 60 గంటలు మాట్లాడారని చెప్పారు. ముఖ్య మంత్రి, మంత్రులు 34 గంటలు మాట్లాడారని, అందులో ఏ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీకి 19 గంటల సమయాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని అడిగిన రుణమాఫీ - ఫీజురీయింబర్స్‌మెంట్ - ఇందిరమ్మ ఇండ్ల బకాయిలు - కాళేశ్వరం ప్రాజెక్టు - పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు - చెరువుల పూడిక తీత - సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ - రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు - గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు - మెట్రోరైలు - హరితహారంలో మొక్కలు నాటడం వంటి సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని భట్టి మండిపడ్డారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రజాసమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అన్నింటికి సమాధానమిచ్చామని అబద్ధాలు చెబుతుందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీ సహకరించిందని భట్టి చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/