Begin typing your search above and press return to search.

కేటీఆర్ చేయలేంది హరీశ్ చేశారు

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:55 AM GMT
కేటీఆర్ చేయలేంది హరీశ్ చేశారు
X
ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ అధికారపక్షంలో మంత్రులు కేటీఆర్.. హరీశ్ ల మధ్య అప్రకటిత యుద్ధం సాగుతూనే ఉంటుంది. పైకి ఎంత క్లోజ్ గా కనిపించినా.. వారి మాటల్లో ఎంత ప్రేమ.. అప్యాయత పొంగి పొర్లినా.. అదంతా మాటల్లోనే కానీ.. మనసుల్లో మాత్రం కాదన్న విషయాన్ని ఆ పార్టీకి చెందిన నాయకులే లోగుట్టుగా వ్యాఖ్యానిస్తుంటారు. కేటీఆర్.. హరీశ్ లు చేసే పనుల్ని పోల్చటం.. ఇద్దరి సామర్థ్యాన్ని బేరీజు వేయటం లాంటివి మామూలే. తాజాగా ముగిసిన నారాయణ్ ఖేడ్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. కేటీఆర్ ప్రస్తావనను తెర మీదకు తెస్తున్నారు హరీశ్ వర్గీయులు.

గ్రేటర్ ఎన్నిక మొత్తం అంతా తానై మంత్రి కేటీఆర్ పని చేస్తే.. నారాయణ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలో అలాంటి పాత్రనే మంత్రి హరీశ్ పోషించారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగిన కేటీఆర్.. తాను పడిన కష్టానికి తగ్గట్లే పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టారనటంలో సందేహం లేదు. అదే సమయంలో తాజాగా ముగిసిన నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల్లో హరీశ్ పడిన శ్రమకు తగ్గ ఫలితం కనిపించటం ఖాయమని ఈ ఉప ఎన్నికపై జోస్యం చెప్పిన మూడు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఎన్నికల పోలింగ్ విషయంలో ఒక ఆసక్తికర అంశం కనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో అతి స్వల్ప ఓటింగ్ మాత్రమే నమోదు అయితే.. నారాయణ ఖేడ్ లో మాత్రం అందుకు భిన్నంగా రికార్డు స్థాయి పోలింగ్ జరగటం గమనార్హం. పార్టీకి భారీ మెజార్టీ తెప్పించాలన్న లక్ష్యంతో పని చేసిన హరీశ్.. అందుకు భారీ పోలింగ్ ఒక్కటే మార్గంగా భావించారు. దీంతో.. పోలింగ్ భారీగా నమోదు అయ్యే అంశంపై ప్రత్యేకంగా కసరత్తు చేశారు.

నియోజకవర్గంలో పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఉప ఎన్నిక జరిగే రోజుకు గ్రామంలో ఉండేలా చేయటంతో పాటు.. వారంతా ఓటు వేసేలా హరీశ్ జాగ్రత్తలు తీసుకోవటంతో 81.79 శాతం పోలింగ్ నమోదు కావటానికి కారణమైందని చెబుతున్నారు. ఉప ఎన్నికల విజయంతో పాటు.. పోలింగ్ మీదా హరీశ్ ఫోకస్ చేస్తే.. కేటీఆర్ మాత్రం ఎన్నికల్లో విజయం మీద మాత్రమే దృష్టి సారించారని చెప్పొచ్చు. జనాలు తమవైపే ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేసే విషయంలో (ఓట్లు వేసే విషయంలో) కేటీఆర్ చేయలేని పనిని హరీశ్ చేశారని చెప్పొచ్చు. ఇందుకు గ్రేటర్.. ఖేడ్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ ఫిగర్స్ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తాయని చెప్పక తప్పదు.