Begin typing your search above and press return to search.

తెలుగు మంత్రుల్ని ఒకచోట కూర్చోబెట్టారు

By:  Tupaki Desk   |   22 Jun 2016 2:53 PM GMT
తెలుగు మంత్రుల్ని ఒకచోట కూర్చోబెట్టారు
X
కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంలోకి కేంద్రమంత్రి ఎంటర్ అయ్యారు. కృష్ణా బోర్డు నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య గంటల కొద్దీ చర్చలు జరిగినా.. ఎవరికి వారు తమ వాదనను వినిపించటమే తప్పించి.. వెనుకా ముందుకు అడుగు వేసేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేకపోవటం తెలిసిందే. మంగళవారం ఒక్కరోజే దాదాపు 15 గంటల పాటు ఏపీ.. తెలంగాణ అధికారులతో చర్చలు జరిపిన సందర్భంగా వివాదాల విషయంలో ఇరు వర్గాలు ఒకరికొకరు పోటాపోటీగా వాదనలు వినిపించిన నేపథ్యంలో.. ఇద్దరి మధ్య పంచాయితీ తెగ కొట్టటం అంత తేలిక కాదన్న విషయం కేంద్రం అర్థం చేసుకుంది.

అందుకే.. బుధవారం ఇద్దరిని కూర్చొని మాట్లాడుకొని తమతో మాట్లాడాలని జలవనరుల శాఖ సూచన చేస్తే.. మరోవైపు కేంద్రమంత్రి ఉమాభారతి ఈ ఇష్యూను పర్సనల్ గా టేకప్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమ.. హరీశ్ రావులను ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలని సూచన చేయటమే కాదు.. ఇద్దరు మంత్రుల్ని ఒకచోట భేటీ అయ్యేలా చేయగలిగారు. ప్రస్తుతం ఇరువురు మంత్రులు ఈ వివాదం మీద మాట్లాడుకుంటున్న పరిస్థితి.

గంటల కొద్దీ అధికారుల భేటీలో తేలని అంశాలు.. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల చర్చలతో అయినా ఒక కొలిక్కి వస్తాయేమో చూడాలి. నిజానికి రెండు రాష్టరాల మధ్యనున్న నీటి పంచాయితీలకు ఇరువురు మంత్రులు తరచూ కూర్చొని మాట్లాడుకోవటం మినహా మరో గత్యంతరంలేదు. మరి.. వీరి మధ్య జరిగిన చర్చలు ఎంతమేర ఫలప్రదం అవుతాయో చూడాలి.