Begin typing your search above and press return to search.

ఆ పేరు కోసం హరీశ్ కు తిప్పలెన్నెంటే..

By:  Tupaki Desk   |   15 Dec 2016 7:46 AM GMT
ఆ పేరు కోసం హరీశ్ కు తిప్పలెన్నెంటే..
X
పేరు కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పడుతున్న తిప్పలెన్నో తెలిస్తే షాక్ తినాల్సిందే. దేశంలో నగదు రహిత నియోజకవర్గంగా సిద్ధిపేటను చేయాలన్న బృహత్ సంకల్పాన్ని తలకెత్తుకున్న ఆయన ఎన్ని పాట్లు పడుతున్నారో. నగదు రహిత లావాదేవీల్నిప్రోత్సహించటంతో పాటు.. ఆ దిశగా ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తయారు చేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఇందుకోసం చేయాల్సిన పనులెన్నో. అలాంటివన్నీ ఒక క్రమపద్ధతిన చేస్తే కానీ.. నగదు రహిత నియోజకవర్గంగా మారదు.

అందుకేనేమో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద పనిని హరీశ్ కు అప్పగించారన్న భావన కలగక మానదు. పని రాక్షసుడిగా పేరున్న హరీశ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాన్ని నగదురహితంగా మార్చటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందో హరీశ్ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాటల్ని వింటే.. నగదు రహితంగా మార్చటం అన్నది ఎంత కష్టమైన.. క్లిష్టమైన ప్రక్రియ అన్నది ఇట్టే తెలుస్తుంది. అంతేకాదు.. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించటం అంత తేలికైన విషయం కాదన్నది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే.. ఈ వ్యవహారంలో ఒక దానితో మరొక అంశానికి లింకు ఉండటంగా చెప్పొచ్చు.

నగదు రహిత నియోజకవర్గంగా సిద్ధిపేటను మార్చేందుకు హరీశ్ చేస్తున్న కసరత్తు చూస్తే..

= మొదట ఇంటింటి సర్వే చేశాం. నియోజకవర్గంలో 69,447 కుటుంబాలు ఉంటే.. 52 వేల కుటుంబాల సర్వే పూర్తి అయ్యింది. 18 ఏళ్లు దాటిన వారు ఎంతమందికి బ్యాంకు కార్డులు లేవో తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం. మొత్తం 96 వేల అకౌంట్లు ఉన్నాయి. 60 శాతం మందికి కార్డులు లేవు. కార్డులు ఉన్న పిన్ నెంబర్లు లేని వారు ఉన్నారు. మొత్తం 41 వేల జనధన్ అకౌంట్లలో 80 శాతం ఖాతాలు నిర్వహణలో లేవు. మొత్తంగా 43,344 డెబిట్ కార్డులు కొత్తగా జారీ చేయాల్సి ఉంటే.. ఇప్పటికి 1368 కార్డులు మాత్రమే జారీ చేశాం. మిగిలిన వారికి కార్డులు అందించే బాధ్యతల్ని అప్పగించాం. ఆర్టీసీ.. విద్యుత్.. రేషన్ షాపులు.. డ్వాక్రా సంఘాల్లో నగదు రహితంగా మార్చే పని మొదలెట్టాం. సిద్దిపేట డిపో లోని112 బస్సుల్లో ఈ నెలాఖరు నాటికి స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ప్రజలంతా కార్డులతోనే టికెట్లు కొంటారని కాదు కానీ.. ప్రోత్సహించటానికి వీలు ఉంటుందన్నదే ఉద్దేశం.

= ఆన్ లైన్ లో చెల్లింపులు జరిపేలా ప్రజల్ని ప్రోత్సహిస్తాం. ఆ చెల్లింపులకు ఇబ్బందులు ఉండవన్న నమ్మకాన్ని కలిగిస్తాం. విద్యుత్ బిల్లుల వసూళ్లు ప్రతి నెలా రూ.10 కోట్ల మేర జరుగుతుంటాయి. వీటిల్లో రూ.5కోట్లు హెచ్ టీ కనెక్షన్లది అయితే.. మిగిలినవి ఎల్ టీ కనెక్షన్లు. వీటిల్లో 95 శాతం నగదుతోనే జరుగుతుంటాయి. విద్యుత్ ఉద్యోగులందరికి స్వైపింగ్ మెషిన్లు ఇవ్వటంతో పాటు.. వినియోగదారులందరికి కార్డులు ఉండే ఏర్పాట్లు చేస్తున్నాం.

= నలభై రేషన్ షాపుల్లో ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేశాం. మిగిలిన వాటిల్లోనూ ఏర్పాటు చేయనున్నాం. మున్సిపాలిటీల్లో 60వేల వరకూ లావాదేవీలున్నాయి. అక్కడి వారందరికి స్వైపింగ్ మెషిన్లు ఇవ్వాలి. గ్యాస్ వినియోగదారులందరికి బ్యాంకు అకౌంట్లుఉన్నాయి కాబట్టి.. డీలర్లతో మాట్లాడి సమస్య లేకుండా కచ్ఛితమైన మొత్తం ఆన్ లైన్ ద్వారా తీసుకునే ఏర్పాటు చేస్తున్నాం.

= మూడు వేలకు పైగా వ్యాపారులు వ్యాట్ చెల్లిస్తున్నారు. వీరికి వ్యాట్.. పాన్ కార్డులు ఉంటేనే బ్యాంకులు స్వైపింగ్ మెషిన్లు ఇస్తాయి. చిన్న చిన్న వ్యాపారులకు మెషిన్లు ఇవ్వరు. అందుకే.. వీరికేం చేయాలో చూస్తున్నాం. రైతులకు సహకార సొసైటీల ద్వారా ఎరువులు.. విత్తనాల సరఫరా.. డ్రాక్వా గ్రూపుల లావాదేవీలన్నీ ఆన్ లైన్లో జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గం మొత్తానికి 4383 స్వైపింగ్ మెషిన్లు కావాలి. వాటిల్లో ఇప్పటికి 74 పంపిణీ చేశాం. మిగిలినవి ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి 700 నుంచి 800 మెషిన్లు పంపిణీ చేయాలని భావిస్తున్నాం. ఈ మెషిన్లకు అద్దె చెల్లించాలి. అలాంటి లేకుండా చూడాలని.. బ్యాంకులతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ సాధ్యం కాకపోతే.. ప్రభుత్వమే భరించాలన్న ఆలోచన చేస్తున్నాం.

= నగదు రహిత లావాదేవీల్లో ప్రధాన సమస్య బ్యాంకుల్లో తగిన సిబ్బంది లేకపోవటం. చాలా బ్రాంచిలలో ఒకే అధికారి ఉన్నారు. అన్ని బ్యాంకులు.. గ్రామాలను.. వార్డులను దత్తత తీసుకున్నా.. వారందరికి అవసరమైన ఖాతాలు తెరిపించటం.. డెబిట్ కార్డులు ఇవ్వటం లాంటివి చేయలేకపోతున్నాం. మరోవైపు చిన్న వ్యాపారులు టర్నోవర్ రూ.7.5లక్షలు దాటితే వ్యాట్ పరిధిలోకి వెళతారు. వీరంతా ఆన్ లైన్ లోకివస్తే ఆదాయపన్ను శాఖ పరిధిలోకివెళతారు. ఒకవేళ వీరు ఆన్ లైన్ లో మారినా.. పక్కన ఎక్కడైనా జీరో వ్యాపారంతో తక్కువకు విక్రయిస్తే తమ అమ్మకాల మీదప్రభావం పడుతుందని భయపడుతున్నారు. ఇలాంటివి లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

= ప్రైవేటు స్కూళ్లు.. ఆసుపత్రుల్లో సమస్యలు ఉన్నాయి. వారంతా ఆన్ లైన్లోకి మార్చాల్సిన అవసరం ఉంది. ఆన్ లైన్ ద్వారా లావాదేవీల్ని నిర్వహించేందుకు వీలుగా.. గ్రామీణుల్లోఅవగాహన పెంచేందుకు ప్రతి 150 కుటుంబాలకు ఒక బ్యాంకు ఉద్యోగి.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత తీసుకొని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల్ని సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి.. యాప్ ల గురించి వారిలో అవగాహన పెంచేలా చేయాలని భావిస్తున్నాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/