Begin typing your search above and press return to search.

కాళేశ్వరంపై ట్వీట్ చేసి బుక్కైపోయిన మహేశ్

By:  Tupaki Desk   |   22 Jun 2019 11:18 AM GMT
కాళేశ్వరంపై ట్వీట్ చేసి బుక్కైపోయిన మహేశ్
X
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. అందంలో, నటనలో సత్తా చాటుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌ గా వెలుగొందుతున్నాడు. ఒకవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతూనే, మరోవైపు పలు సంస్థలకు యండార్స్ చేస్తూ పక్కా బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మహేశ్.. అందరికీ అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో సామాజిక, రాజకీయ, క్రీడాంశాలపై స్పందిస్తుంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘‘విప్లవాత్మకం, ఆదర్శం. ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించారు. ఇందుకు గానూ కొత్త టెక్నాలజీతో దీనిని రూపొందించిన ఇంజనీర్లకు హాట్సాఫ్. అలాగే తెలంగాణ సీఎంఓ, కేటీఆర్‌ కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశాడు. మహేశ్ చేసిన ఈ ట్వీట్‌ పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ఆయన చేసిన ట్వీట్‌లో టీఆర్ ఎస్ నేత హరీశ్ రావు పేరు లేకపోవడమే.

అవును.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎంతో హైలైట్ అయిందో.. అక్కడ హరీశ్ రావు లేకపోవడం కూడా అంతే హైలైట్ అయింది. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయ్యాయి. అలాంటిది ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో ఆయన కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. దీనిపై హరీశ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఏకి పారేస్తున్నారు. మిగతా పార్టీల వారు సైతం దీనిని వాడుకుంటున్నారు.

ఇప్పుడు మహేశ్ చేసిన ట్వీట్‌ లో కూడా ఆయన పేరు పెట్టకపోవడంతో, అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘హరీశ్ పేరు లేకపోయినా పర్లేదు కానీ, కేటీఆర్ పేరు ఎందుకు పెట్టావు’’ అంటూ ఆయన అభిమానులు మహేశ్‌‌ ను ఏకిపారేస్తున్నారు. అంతేకాదు, ‘‘నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రేయింబవళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పని చేసిన హరీశ్‌ ను నువ్వెందుకు మర్చిపోయావ్’’ అని కొందరు.. ‘‘నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు.. నీకు ఫ్యాన్ అయినందుకు బాధపడుతున్నాం’’ అని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

నిన్న (శనివారం) తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని ఎంతో భూభాగం పంటలతో కళకళలాడనుంది.