Begin typing your search above and press return to search.

కేంద్రంపై హరీష్ ఫుల్ ఫైర్

By:  Tupaki Desk   |   3 Dec 2020 5:30 PM GMT
కేంద్రంపై హరీష్ ఫుల్ ఫైర్
X
కేంద్రప్రభుత్వంపై కేసీయార్ ప్రభుత్వం స్పష్టమైన వ్యతిరేకస్టాండ్ తీసుకున్నట్లే కనబడుతోంది. ఎందుకంటే నిన్నటి వరకు కేంద్రప్రభుత్వం పైనో లేకపోతే నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మీదో కేసీయార్ ఒక్కళ్ళే విరుచుకుపడేవాళ్ళు. ఎక్కడ బహిరంగసభలు జరిగినా కేంద్రంపై కేసీయార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మంత్రి హరీష్ రావు కూడా కేంద్రం వైఖరిపై తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల సర్వసభ్య సమావేశంలో హరీష్ మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల పేరుతో దేశంలోని రైతాంగాన్ని నిలువునా ముంచేస్తున్నట్లు మండిపడ్డారు. గడచిన ఎనిమిది రోజులుగా ఢిల్లీ శివార్లలో నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు కూడా కేంద్రానికి టైం దొరకటం లేదా అంటూ రెచ్చిపోయారు. నిజానికి గురువారం కేంద్రప్రభుత్వం రైతు సంఘాలతో సమావేశం జరిపింది. అయితే సమావేశంలో ఏమైందో ఇంకా తెలీదు.

గిట్టుబాటు ధరలు తదితరాల విషయమై రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ సమస్యలను కేంద్రం పరిష్కరించటంలో ఫెయిలైందంటు ఎద్దేవా చేశారు. సమస్యలను పరిష్కారిస్తామంటూ కేంద్రం రాతమూలకంగా రాసిస్టే తాము ఆందోళన విరమించుకుంటామని చెప్పినా కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. నిజానికి ఏ ప్రభుత్వమూ సమస్యల పరిష్కారంలో రాతపూర్వక హామీలివ్వదని హరీష్ కు తెలీదా ? ఆర్టీసీ సమ్మె జరిగినపుడు కేసీయార్ కూడా చర్చలు జరపటానికి ఇష్టపడని విషయాన్ని హరీష్ కన్వీనియంట్ గా మరచిపోయినట్లున్నారు.

రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రమే రైతుల ఆందోళనను అణిచివేస్తోందంటూ మంత్రి ఆరోపించారు. ఎనిమిది రోజుల్లో ఐదుగురు రైతులు మరణించినట్లు మంత్రి తెలిపిరు. ముగ్గురు రైతులు ఆందోళనల్లో భాగంగా చనిపోతే మరో ఇద్దరు చలికి తట్టుకోలేక మరణించారట. అసలు రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కానీ లేదా రైతుల ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానం ఉందా అనే సందేహాన్ని కూడా హరీష్ వ్యక్తం చేశారు. కాబట్టి హరీష్ ప్రశ్నలను అందరు ఆలోచించాల్సందే.