Begin typing your search above and press return to search.

తల దాచుకోమంటే పుల్లలు పెడతారా?

By:  Tupaki Desk   |   14 Aug 2015 6:58 AM GMT
తల దాచుకోమంటే పుల్లలు పెడతారా?
X
కొంతమంది మీద కొందరు చేసే వ్యాఖ్యల తీవ్రత భారీగా ఉండటమే కాదు.. వారు మాత్రం చేయాలన్నట్లుగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి.. రోజా మీద అచ్చెన్నాయుడు.. చిరంజీవి మీద రోజా.. ఇలా చాలానే కాంబినేషన్లు కనిపిస్తాయి. కానీ.. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మాత్రం విమర్శలంటే చాలు.. కేసీఆర్.. కేటీఆర్... హరీశ్ రావు.. షర్మిల.. జగన్ లాంటి నేతలు చాలామంది ఉంటారు. బాబుపై విమర్శ అంటే చాలు.. ఉత్సాహం ప్రదర్శించే నేతలు చాలామందే ఉన్నా.. వీరి పంచ్ ల తర్వాతే ఎవరివైనా.

తాజాగా.. అదే తీరులో మరోసారి చెలరేగిపోయారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ మీద పదేళ్లు హక్కు ఉందని చెబుతూ.. పంజాబ్ రాష్ట్రంలో ఛండీగఢ్ మాదిరే అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ విభజన చట్టాన్ని చంద్రబాబు చదివారా? అందులో ఏముందన్న విషయాలు చూస్తే తెలుస్తుందన్నారు. తలదాచుకోవటానికి మాత్రమే పదేళ్లు అవకాశం ఇచ్చామే తప్పించి.. రాజకీయాలు చేయటానికి మాత్రమేనని స్పష్టం చేశారు.

చంఢీగడ్.. హైదరాబాద్ ఒక్కటయ్యే అవకాశం లేదని.. ఛండీగడ్ లో కేంద్రం పాలన ఉందని చెప్పిన హరీశ్..రెండూ ఒకటి కాదన్నారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటూ భవనాలు వాడుకోవటానికి మాత్రమే వీలుందని.. కానీ.. దాన్ని సాకుగా తీసుకొని రాజకీయాలు చేస్తే బాగోదని చెప్పారు. రాజధానిలో ఉండమని అకవాశం ఇస్తే పుల్లలు పెడతారా? అంటూ ధ్వజమెత్తిన ఆయన.. నెలకో విదేశీ పర్యటన చేసే చంద్రబాబు సంగతి తెలుగువారందరికి తెలుసన్నారు. మొత్తానికి బాబును విమర్శించే ప్రయత్నంలో హరీశ్.. బాగానే కడిగేసినట్లుగా కనిపిస్తోంది.