Begin typing your search above and press return to search.

గుండెల మీద తన్నాడు: ఈటలపై హరీష్ ఫైరింగ్

By:  Tupaki Desk   |   11 Aug 2021 2:30 PM GMT
గుండెల మీద తన్నాడు: ఈటలపై హరీష్ ఫైరింగ్
X
ఇన్నాళ్లు తెరవెనుక ఉండి నడిపించిన మంత్రి హరీష్ రావు ఇప్పుడు హుజూరాబాద్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. భారీ బైక్ ర్యాలీతో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఊపు తెచ్చాడు. భారీ బహిరంగ సమావేశంలో బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజకవర్డంలోని ఇల్లంతకుంట మండలంలో జరిగిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెల మీద తన్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. గులాబీ జెండాతో ఎదిగిన ఈటల.. చివరకు అదే జెండాను మోసం చేశారని ఆరోపించారు.మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయిన ఈటల.. ఇప్పుడేం చేస్తాడో ప్రజలు ఆలోచించాలన్నారు.

హుజూరాబాద్ లో ప్రజలకు లాభం జరగాలా? లేక ఈటలకు లాభం జరగాలా అనే విషయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం.. ఈటల గెలిస్తే ఏం చేస్తారో అడగండి అని హుజూరాబాద్ ప్రజలను కోరారు మంత్రి హరీష్ రావు. ఈటల ఓటమి భయంతోనే తండ్రి లాంటి కేసీఆర్ ను, తనను 'అరేయ్.. ఒరేయ్' అంటున్నారని హరీష్ రావు విమర్శించారు.

ఈటల బీజేపీలో చేరిన తర్వాత కొత్త భాష నేర్చుకుంటున్నారని హరీష్ విమర్శించారు. తనకు అన్నం పెట్టి, అక్షరాలు నేర్పి, ఇన్ని పదవులు ఇచ్చిన కేసీఆర్ ను పట్టుకొని 'అరేయ్, రా' అని సంభోదిస్తున్నాడని ఆరోపించారు. అతడిలా తాను సంస్కారం తగ్గించుకోవాలనుకోవడం లేదని అన్నారు.

ఆస్తుల కోసం వామపక్ష భావాలను, సిద్ధాంతాలను వదలుకొని బీజేపీలో ఈటల చేరారని హరీష్ రావు ఆరోపించారు. నీ మాటలు చూస్తుంటే నీలో ఓటమి ఫస్ట్రేషన్ కనిపిస్తోందని మాకు అర్థమైంది అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు ఖాయమని హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం అని.. ఈటల గెలిస్తే ఏం చేస్తారో అడగండి అని హరీష్ రావు హుజూరాబాద్ ప్రజలను అడిగారు. ఒక వ్యక్తిగా ఈటల గెలుస్తాడు కానీ.. ప్రజలుగా మీరంతా ఓడిపోతారని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీలో చేరగానే ఈటల పని అయిపోయిందని హరీష్ విమర్శలు గుప్పించారు.