Begin typing your search above and press return to search.

మంత్రి హ‌రీష్ రావు నోరు విప్పారు.. ఈట‌ల‌పై ఫుల్ ఫైర్‌

By:  Tupaki Desk   |   5 Jun 2021 4:30 PM GMT
మంత్రి హ‌రీష్ రావు నోరు విప్పారు.. ఈట‌ల‌పై ఫుల్ ఫైర్‌
X
మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్సెస్ అధికార పార్టీ టీఆర్ ఎస్ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న మంత్రి హ‌రీష్‌రావు.. తాజాగా నోరు విప్పారు. నిజానికి హ‌రీష్ రావు కూడా అనేక అవ‌మానాలు ఎదుర్కొంటున్నారంటూ.. ఈట‌ల ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. దీనిపై మీడియాలోనూ అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో హ‌రీష్ రావు ఏమంటార‌నే ఉత్సుక‌త స‌ర్వ‌త్రా ఉంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న హ‌రీష్‌రావు.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించింది.

హ‌రీష్ ఏమ‌న్నారంటే..
రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి హరీశ్ రావు స్పందించారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈటల పార్టీని వీడటానికి అనేక కారణాలు ఉండొచ్చని, పార్టీలో ఉండాలా.. పోవాలా అన్నది ఆయన ఇష్టమన్నారు. తన భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకోవడం విఫలప్రయత్నమన్నారు. ఈటల పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకిచ్చింది ఎక్కువని పేర్కొన్నారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు ఈటల వైఖరి ఉందని విమర్శించారు. ఈటల పార్టీని వీడినా టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదన్నారు.

కేసీఆరే దేవుడు!
కేసీఆర్‌ తనకు మార్గదర్శి అని, తండ్రి కంటే ఎక్కువని మంత్రి హ‌రీష్ రావు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పారు. అంతేకాదు, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్నారు. తనకు పార్టీ ప్రయోజనాలే పరమావధి అని, నాయకత్వం ఏ పని అప్పగించినా పూర్తి చేయడం తన విధి అన్నారు. ‘‘తన గొడవలకు నైతిక బలం కోసం పదేపదే నా పేరు ప్రస్తావించడం.. ఈటల భావదారిద్య్రానికి నిదర్శనం’’ అంటూ హరీశ్ తీవ్ర వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో సెంట‌ర్ ఆఫ్‌ది న్యూస్ అయిన ఈట‌ల విష‌యంలో హ‌రీష్ ఈ రేంజ్‌లో స్పందిస్తార‌ని.. ఎవ‌రూ అనుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై ఈట‌ల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.