Begin typing your search above and press return to search.

దీక్ష విరమించకుంటే మానుకోట సీన్ అంటున్న హరీశ్

By:  Tupaki Desk   |   17 May 2016 4:39 AM GMT
దీక్ష విరమించకుంటే మానుకోట సీన్ అంటున్న హరీశ్
X
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిరసనగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ షురూ చేసిన మూడు రోజుల దీక్షపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. దీక్షలతో.. కోర్టు కేసులతో తాము చేపట్టిన ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. తమ ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కుట్రలతో ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు.. జగన్ వ్యవహారశైలితో తాము తీసుకునే నిర్ణయాలతో నష్టపోయేది ఆంధప్రదేశ్ ప్రజలేనని చెప్పిన హరీశ్ రావు.. అందుకు కారణం చంద్రబాబు.. జగన్ లే అవుతారని స్పష్టం చేశారు.

అదిలాబాద్ జిల్లాలో ఇటిక్యాల చెరువు ట్యాంక్ బండ్ పనులు.. తిర్యాణి మండలంలోని ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకీకరణ పనులకు శంకుస్థాపన చేసిన హరీశ్.. జగన్ దీక్ష మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వైఎస్ హయాంలో తెలంగాణకు నష్టం చేకూరుస్తూ.. రాయలసీమకు అక్రమంగా నీళ్లు తీసుకెళ్లారని.. నాటి ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజల నోరు కొట్టిన వైఎస్ కు తగ్గట్లే ఈ రోజు జగన్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘మీ నాయన ముఖ్యమంత్రిగా అక్రమ ప్రాజెక్టులతో మా నోళ్లు కొట్టిండ్రు. ఇప్పుడు తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటవా?’’ అని హరీశ్ ఫైర్ అయ్యారు. స్వార్థ రాజకీయాల కోసమే జగన్ దీక్షలు చేస్తున్నట్లుగా హరీశ్ అభివర్ణించారు.

ఆంధప్రదేశ్ కు చెందిన చుక్క నీరు కూడా తమకు వద్దని.. కృష్ణా నది నుంచి 376 టీఎంసీల నీటి కేటాయింపు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందని.. భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు కట్టినా 376 టీఎంసీల వినియోగానికి కట్టుబడి ఉంటామని తేల్చారు. బ్రిజేష్ కుమార్ ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటామన్న హరీశ్.. జగన్ తన దీక్షను విరమించుకోకుంటే మానుకోట సీన్ మరోసారి పునరావృతం కావటం ఖాయమన్నారు. గతంలో మానుకోటకు వచ్చినప్పుడు జగన్ ను ఎలా అయితే తరిమి కొట్టారో.. అదే విధంగా మరోసారి జరగటం ఖాయమన్నారు.