Begin typing your search above and press return to search.

ఇది.. కొత్త జిల్లాలపై హరీశ్ వార్నింగ్

By:  Tupaki Desk   |   6 Sep 2016 5:13 AM GMT
ఇది.. కొత్త జిల్లాలపై హరీశ్ వార్నింగ్
X
దసరా రోజున తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 17 జిల్లాల్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ అధికారపక్షం డిసైడ్ కావటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన ఏర్పాట్లను చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు వీలుగా కసరత్తు చేసినప్పటికీ.. కొన్ని డిమాండ్లను తెలంగాణ అధికారపక్షం పరిగణలోకి తీసుకోకపోవటంతో నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. సమయం తక్కువగా ఉండటం.. క్లాప్ కొట్టక ముందే రిలీజ్ డేట్ ను గ్రాండ్ గా డిక్లేర్ చేసిన చందంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయటంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వ ప్రతిష్ఠకు కొలమానంగా మారింది. దీంతో.. ఆరు నూరైనా కొత్త జిల్లాల్ని ప్రభుత్వం చెప్పిన రోజునే ఏర్పాటు అనివార్యంగా మారింది. ఇక్కడే కొత్త సమస్యలు పుట్టుకొట్టుస్తున్నాయి. అధికారపక్షం అంత పక్కాగా ఉండటం.. అలా ఎలా వ్యవహరిస్తారు? తప్పుల తడికతో జిల్లాల్ని ఏర్పాటు చేస్తారా? అంటూ విపక్షాలు గుస్సా అవుతున్నాయి.

సాంకేతికంగా దొర్లిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. వాటిని సరి చేయాల్సిందిగా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ.. తెలంగాణ అధికారపక్షానికి మంట పుట్టే మాటను విపక్షం నోటి నుంచి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళతామని.. ఇష్టారాజ్యంగా కొత్త జిల్లాల్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించటం అధికారపక్షానికి కొత్త తలనొప్పిగా మారింది.

అందుకేనేమో తాజాగా హరీశ్ చేసిన విమర్శలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. కొత్తజిల్లాల్ని అడ్డుకునేందుకు కోర్టుకు వెళతామని కాంగ్రెస్ నేతలు అనటం దారుణమని వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల్ని అడ్డుకునే నేతల్ని గ్రామాల్లోకి రానివ్వొద్దని ప్రజలకు సూచన చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేసీఆర్ సర్కారుకు వచ్చే మంచిపేరును రాకుండా చేయాలనే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటుపై సిద్ధిపేట.. జగిత్యాల చౌరస్తాలో చర్చలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హరీశ్ సవాలుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తనకు పట్టున్న ప్రాంతాల్లో బహిరంగ సభ కంటే కూడా కొత్త జిల్లాగా మార్చాలంటూ వేలాదిమంది రోడ్ల మీదకు వస్తున్న పరకాల.. గద్వాల్ చౌరస్తాలో బహిరంగ చర్చకు హరీశ్ సిద్ధమా అని తెలంగాణ విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త జిల్లాల్ని అడ్డుకుంటామన్న విపక్షాల మాటల్ని చెక్ చెప్పినందుకు వారిని గ్రామాల్లోకి రానివ్వొద్దంటూ హరీశ్ వార్నింగ్ ఇవ్వటాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.