Begin typing your search above and press return to search.

కాంగ్రెసోళ్లను టోకుగా దెబ్బేసిన హరీశ్

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:32 AM GMT
కాంగ్రెసోళ్లను టోకుగా దెబ్బేసిన హరీశ్
X
సమర్థుడైన నాయకుడు ఒక్కడు.. వందమంది నాయకులకు సరి సమానం. ఆ విషయం తెలంగాణ అధికారపక్షాన్ని చూస్తే అర్థమవుతుంది.అలా అని టీఆర్ఎస్ లో సమర్థులైన వారు లేరన్నది కాదు. కానీ.. కీలక నేతల్లో కొందరి సమర్థత చూసినప్పుడు.. అంతటి సమర్థత రెండు తెలుగురాష్ట్రాల్లో మరే పార్టీలోనూ కనిపించదనే చెప్పాలి. తెలంగాణ అధికారపక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి కాకున్నా.. దానికి దగ్గరగా వెళ్లే మాట తీరు హరీశ్ రావు సొంతం. కేటీఆర్ మాదిరి సాత్వికంగా మాట్లాడని హరీశ్ మాటల్లో దూకుడుతనం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయితే.. తాను చేసే ప్రతి విమర్శ విషయంలోనూ లాజిక్కు ను వెంట పెట్టుకునే వైనం కనిపిస్తుంది.

తమపై విమర్శలు చేసే రాజకీయ ప్రత్యర్థులపై మాటల దాడి చేసే క్రమంలో.. ఏదో మాట్లాడామంటే మాట్లాడామన్నట్లు కాకుండా.. కాస్తంత అధ్యయనం చేసినట్లుగా కనిపిస్తుంది. మహారాష్ట్రతో తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసుకున్న చారిత్రక ఒప్పందంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వైనం తెలిసిందే. ఈ సందర్భంగా కాస్త మౌనాన్ని పాటించిన హరీశ్.. తాజాగా ఎదురుదాడికి దిగారు.

కాంగ్రెస్ నేతల తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వదలకుండా.. ఆంధ్రా.. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీరును ప్రస్తావించి టీ కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేశారని చెప్పక తప్పదు. మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వైఖరిని దుయ్యబట్టిన ఆయన.. తెలంగాణలో మహా ఒప్పందాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని.. అదేరీతిలో మహారాష్ట్రలోనూ అక్కడి కాంగ్రెస్ మహా ఒప్పందం కారణంగా మహారాష్ట్రకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చేస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ తీరుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ.. తెలంగాణలో అద్భుతంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని.. ఏపీ సర్కారు ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు బండారాన్ని మొత్తంగా బయటపెడతామని చెప్పిన హరీశ్.. తన వాదనతో ఆ పార్టీ నేతల్ని డిఫెన్స్ లో పడేసినట్లుగా చెప్పొచ్చు. ఒకే అంశంపై ఒకే పార్టీ రాష్ట్రానికో మాట వినిపించటం ధర్మం కాదు కదా..?