Begin typing your search above and press return to search.

వ్యతిరేకులకు ఒక ప్రజంటేషన్ ఇవ్వొచ్చుగా హరీశ్

By:  Tupaki Desk   |   13 Sep 2016 5:50 AM GMT
వ్యతిరేకులకు ఒక ప్రజంటేషన్ ఇవ్వొచ్చుగా హరీశ్
X
తెలంగాణ రాష్ట్రమంత్రి హరీశ్ రావుకు కోపం కట్టలు తెంచుకుంటోంది. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే ఏ నాయకుడికి అంతేనేమో. తాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడటం.. పెద్ద ఎత్తున నిరసనలు ఎదురుకావటం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాస్తవానికి మల్లన్నసాగర్ అంశంతోనే తెలంగాణ కాంగ్రెస్ లో పోరాట పటిమ పెరిగిందని చెప్పాలి. మల్లన్నసాగర్ పై పోరాటానికి ముందు కకావికలమైనట్లుగా కనిపించిన కాంగ్రెస్ నేతల్ని ఒకచోటకు చేర్చిందని చెప్పొచ్చు.

అప్పటివరకూ ప్రభుత్వ విధానాలపై బలంగా నిలదీసే పరిస్థితే లేని వేళ.. మల్లన్నసాగర్ నిర్వాసితులు ఉద్యమించటం.. కాంగ్రెస్ కు కొత్త శక్తి వచ్చినట్లైంది. నాటి నుంచి ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పోరాడుతోంది. రోజురోజుకీ ఉధృతమవుతున్న ఈ పోరాటం తెలంగాణ అధికారపక్షాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ ప్రాజెక్టుపై అడుగు ముందుకు వేయలేని పరిస్థితిని సృష్టిస్తుంది. అందుకే.. తన ఆగ్రహాన్ని మరోసారి ప్రదర్శించారు హరీశ్.

మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన క్రమంలో ఆయన వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రా ప్రాంతానికి మూడు పంటలకు సాగునీటి అందించేందుకు నిర్మించిన పులిచింతల ప్రాజెక్టులో 41 గ్రామాలు ముంపునకు గురైనా పట్టించుకోలేదని.. నాడు మంత్రి పదవి కోసమే ఉత్తమ్ స్పందించలేదన్నారు. తక్కువ ముంపు.. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ ను నిర్మిస్తామంటే కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని మండిపడ్డారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టులో 21 గ్రామాలు.. మిడ్ మానేరులో 12 గ్రామాలు ముంపునకు గురి అవుతున్నాయని.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద 8 గ్రామాలు మాత్రమే ముంపునకు గురి అవుతున్నా.. ఓర్వలేని తనంతో కాంగ్రెస్ ప్రాజెక్టుకు అడ్డుపడుతుందని ఆరోపించారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు మత కలహాలనే సృష్టించారని.. అసాంఘిక శక్తులతో కలిసి మల్లన్నసాగర్ ను అడ్డుకోవాలని చూస్తున్నట్లుగా హరీశ్ ఆరోపించారు.

ఇన్ని లెక్కలు చెబుతున్న హరీశ్.. ముంపు గ్రామాలతో పాటు.. ముంపునకు గురయ్యే భూమి ఎంతన్న లెక్క కూడా చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముంపు గ్రామాల లెక్క చూసేందుకు తక్కువగా ఉన్నా మల్లన్నసాగర్ కింద పోయే భూమి చాలా ఎక్కువన్న వాదన ఉంది. ఇలాంటి సందేహాల్ని తీర్చటంతో పాటు.. విపక్షాల అభ్యంతరాలపై అఖిలపక్షం ఏర్పాటు చేసి.. వారికున్న సందేహాలు తీర్చొచ్చు కదా?

రాజకీయాలకు అతీతంగా పలు వర్గాల వారిని పిలిపించి ప్రజంటేషన్ ఇస్తూ వారి మద్దతు కోరుతున్న హరీశ్.. మల్లన్నసాగర్ ను వ్యతిరేకిస్తున్న వారందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి.. ప్రజంటేషన్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యతిరేకిస్తున్న వారి వాదనల్ని విని.. ప్రభుత్వ వాదనను వినిపించటం ద్వారా రాజీ ఫార్ములా తయారు చేసే వీలుంది. అలాంటివి వదిలేసి.. పెద్ద ఎత్తున విమర్శలు చేయటం ద్వారా ఇష్యూ మరింత క్లిష్టంగా మార్చటమే తప్పించి.. ప్రాజెక్టు నిర్మాణానికి ఏ మాత్రం సాయపడదన్న విషయాన్ని హరీశ్ గుర్తిస్తే మంచిది. పవర్ చేతిలో ఉన్నప్పుడు అన్ని పక్షాల వారిని కలుపుకుపోవాలన్న ఆలోచన రాదెందుకు?