Begin typing your search above and press return to search.

స‌గం ఎమ్మెల్యేతో స‌మ‌స్య అంటున్న హరీశ్‌

By:  Tupaki Desk   |   21 Jan 2017 4:49 AM GMT
స‌గం ఎమ్మెల్యేతో స‌మ‌స్య అంటున్న హరీశ్‌
X
ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీల సమస్యలపై చర్చించలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం వ్యాసం రాయ‌డంపై తెలంగాణ సాగునీటిపారుదల - శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు మండిపడ్డారు. దీని ద్వారా ఆయన సభను, సభ్యులను అగౌరవపరిచాడని మండిప‌డ్డారు. 'మీ సభ్యుడు రాజయ్యను అడుగు చర్చ జరగలేదేమో. ప్రజలను కూడా కోరుతున్నాం. ఇవాళ ఆయన రాసిన వ్యాసాన్ని చదవాలి. ఫ్రెష్ మెమరీతో ఉన్న ప్రజలు సీపీఎం వైఖరిని అర్థం చేసుకోవాలి' అని అన్నారు. సీఎం సభలో ఉండి పలు అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 'భూసేకరణ చట్టం వెబ్‌ సైట్‌ లోనే ఉంది. చట్టం కాపీలను సభ్యులకు ఇవ్వకుండానే ఆమోదించుకున్నారని వీరభద్రం అంటున్నారు. అసలు అది సాధ్యమేనా? సభ్యులందరికీ కాపీలు ఇచ్చి, వారు చదువుకున్న తరువాతే చర్చించి - ఆమోదించాం. తరువాత శాసనమండలికి పంపి అక్కడ కూడా ఆమోదించి గవర్నర్‌ కు పంపాం. గవర్నర్ సంతకం తరువాత ఢిల్లీకి వెళ్లేముందు శాసనసభ వెబ్‌ సైట్‌ లో పెట్టాం. ఇప్పుడు కూడా ఆన్‌ లైన్‌ లోనే ఉంది. కానీ వీరభద్రానికి మాత్రం కనిపించడంలేదట' అని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో సాధారణంగా ప్రభుత్వమే ఎజెండా నిర్ణయిస్తుండ‌గా,కానీ మా ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు చెప్పిన అంశాలనే ఎజెండాగా మార్చారని హ‌రీశ్ రావు అన్నారు. నోట్లరద్దుపై మొదటిరోజే చర్చించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి అడిగితే దానితోనే సభను ప్రారంభించామ‌ని గుర్తుచేశారు. 'అంత హుందాగా మేం సభను నిర్వహిస్తే తమ్మినేని వీరభద్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అబద్ధాలకోరు - లత్కోర్ నాయకుడికి ప్రజలే గుణపాఠం చెప్తారు. తెలంగాణ జాతి గౌరవాన్ని కాపాడుకుంటారు. సమాజం మొత్తం అసెంబ్లీ సమావేశాలు గొప్పగా జరిగాయని అంటుంటే, లేదు అసలు చర్చే జరగలేదు.. ఉసూరుమనిపించారంటే ఎట్లా..? ఇట్లనే మాట్లాడితే ఆ ఒక్క సీటు కూడా పోతుంది' అని హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. సీపీఎం - తమ్మినేని వీరభద్రం తీరును తీవ్రంగా విమర్శించారు. 'ఇవాళ సీపీఎం పార్టీలో 25-30 ఏళ్ల‌ వయసువారు ఎవరైనా చేరే పరిస్థితి ఉందా..? ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సీపీఎం తీరుకు బెంగాలే నిదర్శనమని, అక్కడ ఏ ఎన్నికలు జరిగినా రోజురోజుకు ఓట్లు తగ్గుతున్నాయని, రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా రావు' అని అన్నారు. ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీల ఆదరణ పొందని పార్టీకి చెందిన నాయకుడు తమ్మినేని వీరభద్రం తమ ప్రభుత్వంపై మాట్లాడటం సిగ్గుచేటని, సూర్యునిపై ఉమ్మేసినట్లుగానే వారి విమర్శలున్నాయని మండిపడ్డారు. సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారని, ఆయన పూర్తిగా తెలంగాణ ఎమ్మెల్యే కాడని - సగం ఇక్కడ - సగం ఆంధ్రకని చెప్పారు. ఏం చేస్తే మంచిదో సభలో చెప్పి, దాన్ని ఆమోదించుకుని, బయట మరోలా మాట్లాడటం సరైంది కాదని అన్నారు.

ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీల కోసం సభలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని, డ‌బుల్ బెడ్రూం ఇండ్ల రుణాల రద్దు - గురుకులాలపై విధాన ప్రకటన, కార్పొరేషన్ లోన్ల సబ్సిడీని 50 నుంచి 80 శాతానికి పెంచడం వంటివి చేశామని హ‌రీశ్ రావు వెల్లడించారు. ఇవన్నీ బలహీనవర్గాలకు సంబంధించినవి కావా? అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో సభను జరిపామని, 15 అంశాలపై చర్చల్లో ప్రతి ఒక్క సభ్యుడు మాట్లాడారని చెప్పారు. ప్రతిపక్ష నేతలు సభలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తుంటే, కొందరు వారి పార్టీ ఎమ్మెల్యేలే సభ బయట మరోలా మాట్లాడుతున్నారని, మరికొందరు వ్యాసాలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీలకు 30 ఏళ్ల‌లో ఏం జరిగిందో చెప్పాం.. రెండున్నరేండ్లలో ఏం చేశామో చెప్పామని వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/