Begin typing your search above and press return to search.

వైఎస్‌ పై ప్ర‌శంస‌..టీఆర్ ఎస్‌ పై కాంగ్రెస్ అస‌హ‌నం

By:  Tupaki Desk   |   23 Jan 2018 4:16 AM GMT
వైఎస్‌ పై ప్ర‌శంస‌..టీఆర్ ఎస్‌ పై కాంగ్రెస్ అస‌హ‌నం
X
తెలంగాణ సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లో హుందాగా వ్య‌వ‌హ‌రించ‌డం...మంచిని మంచి..చెడును చెడుగా చూడటం కాంగ్రెస్ నాయ‌కుల‌కు తెలియ‌ద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ పై కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక - రాజకీయ భవిష్యత్‌ ఉండదన్న భయంతోనే గవర్నర్ పై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.గతంలో వైఎస్ హయాంలో 108 - ఆరోగ్య శ్రీ సేవలను ప్రభుత్వం ప్రవేశపెడితే తాము అసెంబ్లీలోనే ప్రశంసించామని హ‌రీశ్‌ రావు గుర్తు చేశారు. అలాంటి పాజిటివ్ ఆలోచ‌న‌దోర‌ణి కాంగ్రెస్ ఎందుకు అల‌వ‌ర్చుకోలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

మంచిని మెచ్చుకునే కనీస సంస్కారం కాంగ్రెస్ నేతలకు లేదని.. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని గవర్నర్ నరసింహన్ చెప్పడాన్ని జీర్ణించుకోలేక టీఆర్‌ ఎస్ ఏజెంటుగా అభివర్ణించడం నీచమైన విధానమని హ‌రీశ్ రావు విమర్శించారు. గవర్నర్‌ పై కాంగ్రెస్ నాయకులు మల్లు భట్టివిక్రమార్క - శ్రీధర్‌ బాబు తదితరులు చేసిన వ్యాఖ్యలు స‌రికాద‌ని అన్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే వాళ్లకి ఏదో శాపం ఉన్నట్టు కనబడుతున్నదని చెప్పారు. మంచి చెయ్యొద్దు.. మంచి మాట్లాడొద్దు.. మంచి వినొద్దు.. అన్న రీతిలో వారి ధోరణి ఉన్నదని హ‌రీశ్‌ రావు విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉండి మంచి చేయలేకపోయారని, టీఆర్‌ ఎస్ వచ్చిన తర్వాత చేస్తున్న మంచి పనులను ఎవరైనా మెచ్చుకుంటే వినలేకపోతున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నాయకులు నీచరాజకీయాలు మానుకోవాలని, గవర్నర్ నరసింహన్‌ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకోవడంతోపాటుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని హ‌రీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును మెచ్చుకొని వెళ్లారని - దేశంలో మరే ప్రాజెక్టు పనులు ఇంత వేగంగా జరుగలేదని చెప్పారని హ‌రీశ్ రావు గుర్తుచేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలోనూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం కాళేశ్వరం పనితీరు - ప్రభుత్వ కృషిని మెచ్చుకున్నారని వివరించారు. గవర్నర్ పట్ల కాంగ్రెస్ నాయకుల విమర్శలు సంస్కారహీనమని - వ్యవస్థ పట్ల - రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పాలని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. పర్యావరణ అనుమతుల విషయంలో మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకం విషయంలో కర్ణాటక రవాణాశాఖ మంత్రి రేవన్న వచ్చి.. యాదవుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవని సీఎం కేసీఆర్‌ ను అభినందించినందుకు ఆయనపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు కామెంట్లు చేసే నాయ‌కులు 2007లో ప్రాణహిత-చేవెళ్లకు శంకుస్థాపన చేసి 2014 దాకా ప్రాజెక్టు కట్టకుండా ఏం చేశారని ప్రశ్నించారు.