Begin typing your search above and press return to search.

కేబినెట్ మ‌హిళా కోటా!..కేసీఆర్ వ్యూహం ఏమిటంటే?

By:  Tupaki Desk   |   19 Feb 2019 1:44 PM GMT
కేబినెట్ మ‌హిళా కోటా!..కేసీఆర్ వ్యూహం ఏమిటంటే?
X
కొత్త రాష్ట్రం తెలంగాణ‌ను సాధించిన పార్టీగా టీఆర్ ఎస్‌ కు తెలంగాణ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. తొలి ఎన్నిక‌ల్లో ఓ మోస్త‌రు మెజారిటీతో టీఆర్ ఎస్‌ ను గెలిపించిన తెలంగాణ ఓట‌ర్లు మలి ద‌ఫా ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ కు బంప‌ర్ మెజారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కే కేసీఆర్ ప‌నిచేస్తున్నా... త‌న కేబినెట్ లో మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించే విష‌యంలో కేసీఆర్ ఎందుక‌నో తాత్సారం చేస్తూనే వ‌స్తున్నారు. త‌న తొలి టెర్మ్ లో ఒక్క మ‌హిళ‌కు కూడా త‌న మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌కుండానే పెద్ద ఎత్తున విమ‌ర్శలు ఎదుర్కొన్న కేసీఆర్‌.. ఈ ద‌ఫా కూడా అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. నేటి ఉద‌యం త‌న కేబినెట్‌ ను విస్త‌రించిన కేసీఆర్‌.. మొత్తం ప‌ది మందికి చోటు క‌ల్పించినా... అందులో ఒక్క‌రంటే ఒక్క మ‌హిళ కూడా లేకపోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే త‌న కేబినెట్ లో మ‌హిళ‌ల‌కు స్థానం త‌ప్ప‌కుండా క‌ల్పిస్తాన‌ని - అయితే అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా కేసీఆర్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెబుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యూహం ఏమిట‌న్న విష‌యం కూడా చూచాయ‌గా బ‌య‌టకు వ‌చ్చింది. ఈ వ్యూహం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. త‌న తొలి కేబినెట్ లో మేన‌ల్లుడు త‌న్నీరు హ‌రీశ్ రావుకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్.. ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశారు. జాతీయ రాజ‌కీయాల్లో టీఆర్ ఎస్ కీల‌క భూమిక పోషించ‌నుంద‌ని చెబుతున్న కేసీఆర్‌... అందులోకి ట్ర‌బుల్ షూట‌ర్‌ గా పేరొందిన త‌న మేన‌ల్లుడిని దింపేయాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నార‌ట‌.

ఈ క్ర‌మంలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హ‌రీశ్ రావును పార్లమెంట్ కు పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు. ఇందుకోసం మెద‌క్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ఎంపిక చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే హ‌రీశ్ ఎంపీగా వెళితే... సిద్దిపేట ప‌రిస్థితి ఏమిటంటే... హ‌రీశ్ రావు స‌తీమ‌ణిని అక్క‌డి నుంచి బ‌రిలోకి దింపుతార‌ట‌. దీనిపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అంటే హ‌రీశ్ ను పార్ల‌మెంటుకు పంపి... ఇప్పుడు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిద్దిపేట నుంచి ఆయ‌న స‌తీమ‌ణిని రంగంలోకి దించి ఎమ్మెల్యేగా చేసి ఆ త‌ర్వాత హ‌రీశ్ కోటాలో ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ట‌. అంటే హ‌రీశ్ స‌తీమ‌ణిని త‌న కేబినెట్ లో చేర్చుకోవ‌డం ద్వారా ఇటు హ‌రీశ్ తో పాటు ఇటు మ‌హిళా కోటాను కూడా భ‌ర్తి చేసిన‌ట్టవుతుంద‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.