Begin typing your search above and press return to search.

హ‌రీశ్ తో కేంద్రాన్ని ఓ రేంజ్‌లో తిట్టించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   27 April 2022 2:51 PM GMT
హ‌రీశ్ తో కేంద్రాన్ని ఓ రేంజ్‌లో తిట్టించిన కేసీఆర్‌
X
హైద‌రాబాద్ హెచ్ఐసీసీలోని నిర్వ‌హిస్తున్న టీఆర్ఎస్‌ 21వ ప్లీనరీ సమావేశాల్లో ఊహించిన విధంగానే కేంద్రంపై తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. కేంద్రం విధానాల‌ను కేసీఆర్ నిశితంగా కామెంట్ చేశారు. బుర్ర ఉండా.. లేకనా.. తెలివి ఉందా.. లేకనా.. శక్తి సామర్థ్యత ఉండా.. లేక అసమర్థతోనా.. వివేకం ఉందా.. లేక అవివేకమా అంటూ కామెంట్ చేశారు. అయితే, కేంద్రం మాటల్లో అచ్చే దిన్‌.. కానీ.. చేతల్లో సచ్చేదిన్ అంటూ మంత్రి హ‌రీశ్ రావు ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.

కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్‌ పూల్‌లోకి తేవాలని డిమాండ్‌ చేస్తూ ఆర్థిక‌మంత్రి , టీఆర్ఎస్ ముఖ్య నేత హ‌రీశ్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడుతూ, రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్‌ నిలపారన్నారు.

14 సంవత్సరాలు పోరాడి ఎత్తిన పిడికిలి దించకుండా రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్‌ అనీ, దేశంలోనే అతిచిన్న వయసు కలిగిన రాష్ట్రమైనా అన్ని రాష్ట్రాలకు దశ-దిశ చూపిందన్నారు. సీఎం కేసీఆర్‌ రూపొందించిన ప్రగతిశీల ఎజెండా దేశానికి అవసరమని, పక్క రాష్ట్రాల నుంచి కేసీఆర్‌ ఎజెండా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు.

బీజేపీ నేతలు ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటారనీ.. కానీ బతుకు దుర్భర్‌ భారత్‌ అయ్యిందని హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాటల్లో అచ్చే దిన్‌ అని.. కానీ.. చేతల్లో సచ్చే దిన్‌గా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం.. రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఆలోచనలో భాగంగానే చిన్న రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

కానీ ఎక్కడ చూసినా.. దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కావేరి జలాల కోసం తమిళనాడు, కర్ణాటక, సింధూ నది జలాల కోసం పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాలు ప్రతి రోజు యుద్ధం చేస్తున్నాయన్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం ఈ దేశానికి.. కనీసం తాగునీళ్లకు నోచుకోదా భారతదేశం..? అని ప్రశ్నించారు.

తాగునీరు, సాగునీరు, కరెంటు లేదు.. కానీ ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతూ.. దేశానికి ఒక విజనరీ కావాలి కానీ టెలివిజనరి కాదని వ్యాఖ్యానించారు. భారత దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని, మతపిచ్చి- కులపిచ్చి లేకుండా తెలంగాణకు గోల్డెన్ పాలన కేసీఆర్ అందిస్తున్నారన్నారు.