Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ హైక‌మాండ్ ఢిల్లీ.. మ‌రి టీఆర్ ఎస్ దో..?

By:  Tupaki Desk   |   27 July 2018 5:07 AM GMT
కాంగ్రెస్ హైక‌మాండ్ ఢిల్లీ.. మ‌రి టీఆర్ ఎస్ దో..?
X
విమ‌ర్శించాల‌నే కానీ.. తాను వేలెత్తి చూపించే విష‌యాలు త‌మ‌కు కూడా అప్లై అవుతాయ‌న్న చిన్న విష‌యాల్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు అప్పుడ‌ప్పుడు మ‌ర్చిపోతుంటారు. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డాల‌న్న యావ‌తో కొన్ని విష‌యాల్ని అన‌వ‌స‌రంగా ప్ర‌స్తావిస్తున్న మంత్రి హ‌రీశ్ తాజాగా మ‌రోసారి త‌న మాట‌ల‌తో దొరికిపోయారు.

కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో హైక‌మాండ్ ఉంటుంద‌ని.. వారు ఏం చేయాల‌న్న ఢిల్లీ నుంచి అనుమ‌తులు తీసుకోవాల‌ని హ‌రీశ్ వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ మాట‌లో నిజం కొంత ఉన్నా.. టీఆర్ ఎస్ ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్న‌మేమీ కాద‌న్న విష‌యాన్ని హ‌రీశ్ మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. ఒక ముఖ్య‌మంత్రి స‌చివాల‌యానికి రాకుండా నాలుగేళ్ల‌కు పైనే పాలించిన ముచ్చ‌ట ఉందా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. అదేమీ పెద్ద క‌ష్ట‌మైన విష‌యం కాద‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల్లో చేసి చూపించారు కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ స‌చివాల‌యానికి వ‌చ్చిన సంద‌ర్భాల్ని వేళ్ల మీద లెక్కించొచ్చు. అంతేనా.. ఆయ‌న హైద‌రాబాద్ లో ఉండేది ఎంత కాల‌మో అందులో స‌గానికి పైనే రాజ‌ధానికి దూరంగా ఉండే ఎర్ర‌వ‌ల్లిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో అంత కాలం ఉంటార‌ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ లెక్క‌న చూస్తే.. కాంగ్రెసోళ్లు త‌మ పాల‌సీల‌కు సంబంధించి అనుమ‌తులు తీసుకోవాలంటే ఢిల్లీ వంక చూడాలో.. ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ సైతం ఎర్ర‌వ‌ల్లి వైపు చూస్తుంద‌న్న విష‌యాన్ని హ‌రీశ్ ఎలా మ‌ర్చిపోతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎర్ర‌వెల్లికి వెళ్లి రావ‌టానికి ప‌ట్టే స‌మ‌యానికి రెండు మూడు గంట‌ల‌కు మించి ఢిల్లీ ప్ర‌యాణం లేద‌న్నది హ‌రీశ్ మ‌ర్చిపోవుడేంది?