Begin typing your search above and press return to search.

ఓటమి ఎఫెక్ట్: హరీష్ రావు ఇజ్ బ్యాక్..

By:  Tupaki Desk   |   25 May 2019 10:18 AM GMT
ఓటమి ఎఫెక్ట్: హరీష్ రావు ఇజ్ బ్యాక్..
X
ఒక్క దెబ్బకు కేసీఆర్ దిగొచ్చారా..? కొడుకు కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చాక జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దిమ్మదిరిగి బొమ్మ కనపడింది. బీజేపీ, కాంగ్రెస్ పాగా వేసి గులాబీ దళానికి షాక్ ఇచ్చాయి. నేపథ్యంలో గడిచిన కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ గడప తొక్కని హరీష్ నిన్న హఠాత్తుగా సీఎం కేసీఆర్ కోరిక మేరకు వెళ్లి కలిశారు. పార్లమెంట్ ఫలితాలపై సమాలోచనలు జరిపారు. మళ్లీ హరీష్ కు పార్టీలో కీలక స్థానం కట్టబెట్టేందుకు.. ఓటములు, వ్యతిరేతకలను తగ్గించేందుకు కేసీఆర్ నడుం బిగించారన్న చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది. హరీష్ మళ్లీ క్రియాశీలకంగా మారాలని కేసీఆర్ నిర్ణయించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పలు ఎంపీ స్థానాల్లో ఓటమిపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ లోని గ్యాప్స్, అసమ్మతిని తగ్గించేందుకు అధినేత కేసీఆర్ నడుం బిగించారని తెలిసింది. నిన్న హరీష్ రావు వచ్చి కేసీఆర్ తో సమాలోచనలు జరిపాక.. తిరిగి హరీష్ రావును కేబినెట్ లోకి తీసుకొని మంత్రిని చేయనున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది.

తెలంగాణ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించిన కేసీఆర్.. ప్రభుత్వ పగ్గాలు ఉంచేసుకొని పార్టీ పగ్గాలు మాత్రం కొడుకు కేటీఆర్ కు ఇచ్చేశాడు. కనీసం నంబర్ 2గా పార్టీలో చెప్పుకునే హరీష్ రావుకు కేబినెట్ మంత్రి పదవి, పార్టీ పదవులు కూడా ఇవ్వలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అసమ్మతి రేగింది. హరీష్ రావును కొడుకు కేటీఆర్ కోసం సైడ్ చేశారన్న ఆవేదన అందరిలోనూ వచ్చేసింది. ఎన్నికల్లోనూ ఇది ప్రతిఫలించింది. అందుకే ఇప్పుడా ఉద్రిక్తతలను తగ్గించడం పార్టీ, ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేయడంపై కేసీఆర్ దృష్టి సారించారని తెలుస్తోంది.

పార్టీలో కేటీఆర్, ప్రభుత్వంలో హరీష్ ను కీరోల్ చేసి బ్యాలెన్స్ చేయాలని కేసీఆర్ తాజాగా డిసైడ్ అయినట్లు తెలిసింది. దీంతో హరీష్ రావును త్వరలోనే కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ సాగుతోంది. ఇక పార్లమెంట్ లో ఓటమిని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో పనిచేయని మంత్రుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కూడా యోచిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులపై వేటు కూడా వేసే అవాకాశాలున్నాయని సమాచారం. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ స్థానాల్లో మంత్రులుగా సరిగా పనిచేయని వారిని తొలగించి కొత్తవారిని తీసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది.

కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ పై కన్నేసి రాష్ట్ర రాజకీయాలను పట్టించుకోని కేసీఆర్ కు పార్లమెంట్ ఎన్నికలు షాకిచ్చాయి. బీజేపీ బలపడాలని చూస్తోంది. అందుకే పార్టీలోని గ్యాప్స్ ను కవర్ చేయాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. ఇందుకోసం హరీష్ రావును కేబినెట్ లోకి తీసుకోవడంతోపాటు కొందరు మంత్రులపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.