Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌ కు ల‌క్ష కాదు.. అంత‌కు మించేన‌ట‌

By:  Tupaki Desk   |   11 Dec 2018 9:34 AM IST
హ‌రీశ్‌ కు ల‌క్ష కాదు.. అంత‌కు మించేన‌ట‌
X
అనుకున్న‌దే నిజ‌మైంది. అంచ‌నాలే క‌రెక్ట్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మ‌రెవ‌రికీ లేని సానుకూల‌త తాజా మాజీ మంత్రి.. కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావుకు వ‌చ్చే మెజార్టీ మీద అంద‌రూ మాట్లాడుకుంటున్న విష‌యం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మ‌రే అభ్య‌ర్థి మీదా లేనంత సానుకూల‌త‌.. సానుభూతి హ‌రీశ్ రావు మీద ఉంద‌న్నది బ‌హిరంగ‌మే. పార్టీ కోసం పెద్ద ఎత్తున ప‌ని చేయ‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్ కోసం ఎంత‌కైనా.. దేనికైనా సిద్ధ‌మ‌న్న‌ట్లు ఉండే హ‌రీశ్‌ ను కావాల‌నే కొద్ది రోజులుగా తొక్కేస్తున్నార‌న్న మాట అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

దీనికి త‌గ్గ‌ట్లే టీఆర్ ఎస్ అధికారిక ప‌త్రికలో హ‌రీశ్ రావు ఫోటో ఆ మ‌ధ్య వ‌ర‌కూ అచ్చు కాక‌పోవటాన్ని ప్ర‌త్యేకంగా చెప్పుకునే ప‌రిస్థితి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన స‌మ‌యంలో కేసీఆర్‌ లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఆ త‌ర్వాత లేక‌పోవ‌టం.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉంద‌న్న మాట‌తో హ‌రీశ్ ను రంగంలోకి దించ‌టం తెలిసిందే. మొద‌ట హ‌రీశ్ ఊసు ప‌ట్ట‌ని టీఆర్ ఎస్ అధికారిక ప‌త్రిక‌.. ఆ త‌ర్వాత నుంచి ఆయ‌న‌కు ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌టం మొద‌లు పెట్టింది.

ఇలాంటి కార‌ణాలెన్నో హ‌రీశ్ కు సానుకూలంగా మార‌ట‌మే కాదు.. ఆయ‌న సామ‌ర్థ్యం ఏమిటి? ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ప‌లుకుబ‌డి ఎంత‌న్న విష‌యాన్ని త‌మ ఓట్ల ద్వారా చెప్పాల‌న్న భావ‌న సిద్దిపేట ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

త‌మ అభిమాన నేతకు ల‌క్ష మెజార్టీని తెచ్చి పెట్ట‌టం ద్వారా.. హ‌రీశ్ అంటే ఏమిటో కేసీఆర్‌ కు చూపించాల‌న్న ప‌ట్టుద‌ల సిద్దిపేట ప్ర‌జ‌ల్లో వ‌చ్చింద‌న్న మాట వినిపించేది. అంతేకాదు.. కేసీఆర్‌.. కేటీఆర్ లకు మించిన మెజార్టీని హ‌రీశ్‌ కు వ‌చ్చేలా చేయాల‌న్న భావ‌న సిద్దిపేట ఓటర్ల‌లో ఉంద‌ని చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే.. తాజాగా వెలువ‌డుతున్న ఓట్ల లెక్కింపు లెక్క‌లు ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

తొలి రౌండ్‌ తో పోలిస్తే రెండో రౌండ్‌ లో ఎక్కువ‌.. దానికి మించి మూడో రౌండ్ మ‌రింత అధిక్య‌త క‌నిపిస్తున్న ప‌రిస్థితి. కేవ‌లం రెండు రౌండ్లు ముగిసే స‌మ‌యానికి 13వేల ఓట్ల మెజార్టీలో హ‌రీశ్ ఉండ‌టం చూస్తే.. ల‌క్ష లెక్క‌ను ఆయ‌న చాలా ఈజీగా దాటేస్తార‌న్న అభిప్రాయం క‌లుగుతోంది.దీనికి న‌మ్మ‌కం క‌లిగేలా.. మూడో రౌండ్ ముగిసే స‌మ‌యానికి హ‌రీశ్ అధిక్యం 19వేల ఓట్ల పైచిలుకుగా ఉంది. సో.. హ‌రీశ్ మెజార్టీ ల‌క్ష ఏమిటి?.. అంత‌కు మించేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.