Begin typing your search above and press return to search.

మీకు హ‌రీశ్‌ రావు ఏమైనా క‌నిపించాడా?

By:  Tupaki Desk   |   17 Dec 2017 2:04 PM GMT
మీకు హ‌రీశ్‌ రావు ఏమైనా క‌నిపించాడా?
X
ఎవ‌రు అవున‌న్నా...కాద‌న్నా...తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో వార‌స‌త్వ పోరు సాగుతోంద‌నేది..కాద‌నలేని నిజం. ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన‌ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్‌ ను రాజ‌కీయ‌ - స‌ర్కారు వారసుడిగా తీర్చిదిద్దేందుకు సిద్ధ‌మ‌య్యార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం!! ఈ క్ర‌మంలో మేన‌ల్లుడు అయిన మంత్రి హ‌రీశ్‌ రావును ఆయ‌న సైడ్ చేస్తున్నార‌ని...పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతున్నార‌ని ఎప్ప‌టినుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌ర్వంలో మ‌రో స్ప‌ష్ట‌మైన ఉదాహ‌ర‌ణ తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని అంటున్నారు.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల పేరుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అట్ట‌హాసంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రప‌తి మొద‌లుకొని ఉప‌రాష్ట్రప‌తి - దేశ‌ - విదేశాల అతిథుల‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానాలు అందించారు. క‌వులు క‌ళాకారులు ఎలాగూ హాజ‌ర‌య్యారు. దీంతోపాటుగా స‌హ‌జంగానే రాష్ట్ర మంత్రులు - ప్ర‌జాప్ర‌తినిధులు ఉండ‌నే ఉన్నారు. మ‌హాస‌భ‌లు మొద‌టి రోజు నుంచి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న రోజు వ‌ర‌కు వారి హాజ‌రు - ప్ర‌సంగం సాగుతోంది. కొన్ని చోట్ల అయితే... మంత్రుల‌తో పాటుగా ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు కూడా హాజ‌ర‌య్యారు. కానీ ఎక్క‌డా...హ‌రీశ్‌ రావు క‌నిపించ‌లేదని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

కొద్దికాలం క్రితం హైద‌రాబాద్ వేదిక‌గా సాగిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం మెట్రో రైలుకు సైతం హ‌రీశ్‌ ను దూరం పెట్టార‌నే ప్ర‌చారం జ‌రిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మంత్రులంతా హాజ‌రు అయిన‌ప్ప‌టికీ...హ‌రీశ్ ఆ బృందంలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ త‌న మేన‌ల్లుడిని ప‌క్క‌న పెట్టార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు అదే రీతిలో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు దూరం పెట్టార‌ని అంటున్నారు. అయితే..ఈ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ మంత్రి హరీశ్ రావు మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోవ‌డం గ‌మ‌నార్హం.

జ‌న‌గామ జిల్లాలో నీటిపారుదల శాఖ చేప‌ట్టిన ప‌నుల‌ను స‌మీక్షించిన అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం 36 నెలల్లో 365 సంక్షేమ పథకాలు రచించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆశీస్సులు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిండు మనస్సుతో సీఎంకు దీవెనలు ఇవ్వాల‌ని మంత్రి హరీశ్ రావు కోరారు.వచ్చే ఏడాది మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హరీష్‌ రావు చెప్పారు. మల్లన్న స్వామి దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామి అనుగ్రహంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా నిలివాలని కోరుకున్నారు.