Begin typing your search above and press return to search.

హరీశ్ రావుకు సీఎం పదవి వద్దట

By:  Tupaki Desk   |   16 Nov 2015 9:32 AM GMT
హరీశ్ రావుకు సీఎం పదవి వద్దట
X
టీఆరెస్ లో కేసీఆర్ కుటుంబ విభేధాలపై రాజకీయవర్గాల్లో అనేక ఊహాగానాలున్నాయి. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు అమిత ప్రాధాన్యమిస్తూ మేనల్లుడు హరీశ్ ను పూర్తిగా తొక్కేస్తున్నారన్న విషయం టీఆరెస్ వర్గాలూ చెబుతుంటాయి. అయితే.. హరీశ్ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. తాను, కేటీఆర్ ఇద్దరం మంచి స్నేహితులమని... ఇద్దరి మధ్య విభేదాలు లేవని చెబుతున్నారు. అంతేకాదు, తాను, కేటీఆర్ కలిసిమెలిసి ఉండడం చూసి ఓర్వలేనివారు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న కోరికే లేదని స్పష్టం చేశారు.

కేటీఆర్ కు, తనకు ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్న హరీశ్... తమ పట్ల కేసీఆర్ కు మంచి అభిప్రాయం ఉందని, తనను, కేటీఆర్ ను ఒకేలా చూస్తారని కూడా చెప్తున్నారు. ఇద్దరినీ ఆయన ఇష్టపడతారని... ఆయన నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించేందుకు పనిచేయడం తప్ప ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు లేనేలేదని చెప్పుకొచ్చారు. తానుగానీ, కేటీఆర్ గానీ - కవిత గానీ బ్యాక్ డోర్ లో రాజకీయాల్లోకి రాలేదని.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల ఆశీస్సులతో గెలిచినవారమని చెప్పారు.

అయితే... హరీశ్ చెప్పిందంతా బాగానే ఉన్నా బ్యాక్ డోర్ లో రాలేదంటూ ముగ్గురి పేర్లు చెప్పడంలోనే ఆయన చాతుర్యమంతా దాగుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ప్రజల్లో ఉండడం విషయాన్ని లెక్కలోకి తీసుకుంటే హరీశ్ రావు దగ్గర కేటీఆర్ - కవితలు తేలిపోతారు. ఒకరకంగా చెప్పాలంటే కేటీఆర్ - కవితలు బ్యాక్ డోర్ లో వచ్చినవారే. కానీ, వారిని కూడా తనతో కలిపి ప్రజా జీవితం నుంచి వచ్చినవారిమని హరీశ్ చెప్పడంలో ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశమే కనిపిస్తోందంటున్నారు.