Begin typing your search above and press return to search.

గమనించారా?; గ్రేటర్ లో కనిపించని ‘మేనల్లుడు’

By:  Tupaki Desk   |   21 Dec 2015 4:10 AM GMT
గమనించారా?; గ్రేటర్ లో కనిపించని ‘మేనల్లుడు’
X
నెల వ్యవధిలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది. తెలంగాణ అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రేటర్ ఎన్నికల్లో.. తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడైన హరీశ్ రావు పెద్దగా కనిపించకపోవటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ కుమారుడు.. మంత్రి అయిన కేటీఆర్ మాత్రమే కనిపిస్తున్నారే తప్పించి.. మేనల్లుడు కనిపించకపోవటం ఆసక్తికర చర్చకు తావిస్తోంది.

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన మొత్తం వ్యవహారాల్ని మంత్రి కేటీఆర్ కు అప్పజెప్పిన విధానం చూస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన వారసుడి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని.. అందుకు నిదర్శనం గ్రేటర్ ఎన్నికలుగా చెబుతున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. గ్రేటర్ పరిధిలోని విపక్ష నేతల్ని ఆపరేషన్ ఆకర్ష్ బుట్టలో పడేయటానికి కీలకభూమిక పోషిస్తున్న మేనల్లుడు.. ఎన్నికల్లో మాత్రం తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం హరీశ్ వర్గానికి ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ఎంతసేపటికి.. జిల్లాలకు సంబంధించిన వ్యవహారాలు.. బ్యాక్ గ్రౌండ్ విషయాల్లో హరీశ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంటే.. తెర మీద మాత్రం కేటీఆర్ కనిపిస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు.. నగరంలో జరుగుతున్న అంశాల్లో కేటీఆర్ పాత్ర రోజురోజుకీ పెరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంతో పాటు.. వివిధ బస్తీల్లో పర్యటనలో కేటీఆర్ మాత్రమే దర్శనమిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేసీఆర్ అనుసరిస్తున్న విధానం చూస్తుంటే.. మంత్రి కేటీఆర్ కు వారసత్వ పగ్గాలు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా గ్రేటర్ ఎన్నికలు టీఆర్ ఎస్ లో అధిపత్య పోరును మరింత పెంచటం ఖాయంగా చెబుతున్నారు.