Begin typing your search above and press return to search.

మీడియా మీద పడే బదులు ఇద్దరు కలిసి తిరగరే?

By:  Tupaki Desk   |   10 Jan 2016 4:30 AM GMT
మీడియా మీద పడే బదులు ఇద్దరు కలిసి తిరగరే?
X
రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేయటం టీఆర్ ఎస్ నేతలకు అలవాటే. విపక్షాల మీద ఎంత కటువుగా వ్యవహరిస్తారో.. అంతే కఠినంగా మీడియా పట్ల ఉండటం కూడా కేటీఆర్ అండ్ కోలకు అలవాటు. అయితే పొగడాలే తప్పించి.. సున్నితమైన విమర్శల్ని సైతం ఒప్పుకోకపోవటం టీఆర్ ఎస్ కు మొదట్నించి అలవాటు. ఉద్యమ సమయంలో.. ఉద్యమ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా తప్పులు జరిగినా.. తెలంగాణ ప్రజల కోసం చాలానే విషయాల్ని మీడియా పెద్దగా పట్టించుకోలేదు.

కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఉద్యమంలో తప్పులు ఎంచటం కన్నా.. ఉద్యమానికి మద్దతు పలుకుతూ అండగా నిలవాలన్న వైఖరిని నాడు మీడియా ప్రదర్శించింది. ఉద్యమంలో మాదిరే అధికారపక్షం పట్ల కూడా అంతే సానుకూలంగా ఉండాలని కోరుకోవటం అత్యాశే. విమర్శను స్వీకరించే విషయంలో ఏమాత్రం సానుకూలంగా ఉండని గులాబీ బ్యాచ్.. వారి లోగుట్టుకు సంబంధించిన విషయాలు వార్తలుగా వస్తే చాలు ఉడికిపోతారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారు. టీఆర్ ఎస్ పార్టీలో కేటీఆర్.. హరీశ్ గ్రూపులు ఉన్నాయన్నది తెలంగాణ రాజకీయం గురించి అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి తెలుసు.

ఈ వాదనను బలపరిచేలా ఒకటి తర్వాత ఒకటిగా పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితి. మొన్నటికి మొన్న ముగిసిన వరంగల్ ఉప ఎన్నిక సమయంలో కానీ.. ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల ఇష్యూలో మంత్రి హరీశ్ కనిపించని పరిస్థితి. గ్రేటర్ లో అయితే మొత్తం అన్నీ విషయాల్ని కేటీఆర్ చూసుకుంటూ అన్నీ తానైనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కీలకమైన హరీశ్ గ్రేటర్ ఎపిసోడ్ లో అస్సలు ఎంటర్ కావటం లేదు. స్పష్టమైన విభజనతోనే హరీశ్ ను సైడ్ చేస్తున్నారన్న విమర్శ ఉంది.

హరీశ్ నిర్వహణ సామర్థ్యం ఏ స్థాయిలో ఉంటుందో.. ఇటీవల ముగిసిన అయుత చండీయాగం సందర్భంగా స్పష్టమైంది. వెల్లువలా తరలి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు చేతులు ఎత్తేసిన సమయంలో.. హరీశ్ ఎంటరై మైకు పట్టుకొని తన మాటలతో కంట్రోల్ చేయటం.. కొందరు పోలీసుఅధికారులైతే.. ‘‘హరీశ్ అన్న చెప్పిన తర్వాత కూడా ఆయన మాట వినకపోతే ఏం బాగుంటుంది?’’ అంటూ ప్రశ్నించిన వైనం కనిపించింది. మరి.. ఇంతటి బలమైన నాయకుడు గ్రేటర్ ఎన్నికల్లో ఎందుకు మమేకం కావటం లేదు? తనకేమాత్రం సంబంధం లేనట్లుగా ఆయన ఉంటున్నారు? లాంటి ప్రశ్నల నేపథ్యంలో బావ.. బావమరదుల మధ్య నెలకొన్న అంతరంపై మీడియాలో కథనాలు వస్తున్నయి.

ఇలాంటి వాటిపై వస్తున్న విమర్శల్ని మంత్రి కేటీఆర్ తనకు తానుగా ప్రస్తావించి.. మీడియా మీద విరుచుకుపడ్డారు. వార్తలు లేని సమయంలో కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి పుకార్లు పుట్టిస్తాయంటూ కొట్టిపారేశారు. ఒకవేళ అదే నిజమైతే. కేటీఆర్.. హరీశ్ లు ఇద్దరూ కలిసి గ్రేటర్ లో ఎందుకు పర్యటించటం లేదు? ఎందుకు కలిసి పని చేయటం లేదో..?