Begin typing your search above and press return to search.

హ‌రీశ్ రావు మీకెక్క‌డైనా క‌నిపించారా?

By:  Tupaki Desk   |   31 Aug 2018 2:30 PM GMT
హ‌రీశ్ రావు మీకెక్క‌డైనా క‌నిపించారా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర మంత్రి హ‌రీశ్‌ రావు మీకెక్క‌డైనా క‌నిపించారా? ప‌్ర‌గ‌తి నివేదిక సభ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ స‌భ వేదిక ఉన్న‌ కొంగ‌ర‌క‌లాన్‌ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ఎక్క‌డున్నారు? ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాప్ టాపిక్‌. టీఆర్ ఎస్ నేత‌లంతా అక్క‌డ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఉదంతం టీవీల్లో హ‌డావుడి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ నేత‌లంతా రెట్టించిన ఉత్సాహంతో క‌దులుతున్నారు. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌ లో క‌నిపించ‌ని వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారా అంటే...తెలంగాణ రాష్ట్ర మంత్రి - టీఆర్ ఎస్ నేత హ‌రీశ్‌ రావు. టీఆర్ ఎస్ నాయ‌కులంతా ఉత్సాహంతో ముందుకు సాగుతుంటే ఈ ఫ్రేమ్‌ లో అస‌లు క‌నిపించనిది ఎవ‌రైనా ఉన్నారా అంటే... హ‌రీశ్‌ రావు.

గులాబీ ద‌ళ‌ప‌తి - కేసీఆర్ రాజ‌కీయ వార‌స‌త్వం కోసం ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌ కు - హ‌రీశ్‌ రావుకు కుంప‌ట్లు మొద‌ల‌య్యాయ‌ని సుదీర్ఘ కాలంగా చ‌ర్చ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశం పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన స‌మ‌యంలోనే కీల‌క ప‌రిణామం ఒక‌టి చోటుచేసుకుంది. కేటీఆర్‌ కు ప్ర‌స్తుతం ఉన్న శాఖ‌ల‌కు తోడుగా మ‌రో కీల‌క‌మైన శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. అది కూడా హ‌రీశ్‌ కు చెందిన మైన్స్ ఆండ్ జియాల‌జీ శాఖ‌ను ఆయ‌న్నుంచి తొల‌గించి కేటీఆర్‌ కు క‌ట్ట‌బెట్టారు. అదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ వార‌సుడు మంత్రి కేటీఆర్ అంటూ కేసీఆర్ కుమార్తె - ఎంపీ కే.క‌విత ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల‌న్నీ హ‌రీశ్‌ కు పొగ‌పెట్ట‌డంలో భాగ‌మేన‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. దీంతో హ‌రీశ్‌ రావు - మంత్రి కేటీఆర్‌ ల మ‌ధ్య వార‌సుడు ఎవ‌రో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఇందులో కేటీఆర్ పైచేయి సాధించార‌ని - హ‌రీశ్ సైలెంట్ అయ్యార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఎన్నికల మూడ్‌ లోకి ప్రవేశించిన నేపథ్యంలో పార్టీపై పట్టు సాధించేందుకు మంత్రి కేటీఆర్‌ కూడా క్షేత్రస్థాయిలో ప్రగతియాత్రల పేరుతో హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాలు చుట్టి వచ్చేశారు. 2019 ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తే...ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ఆరంగేట్రంలో భాగంగా మేనల్లుడు హరీశ్‌ రావును కూడా తనవెంట తీసుకెళ్తారనే మరో వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల మంత్రి కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్‌ కు ఎలాంటి అవాంతరాలు ఉండబోవని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇవ‌న్నీ గ‌మ‌నించిన నేప‌థ్యంలోనే..హ‌రీశ్ త‌న ప‌ని తాను చేసుకొని పోతున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.