Begin typing your search above and press return to search.

విప‌క్షాలు కోరితే అసెంబ్లీ స‌మావేశాల్ని కుదిస్తార‌ట‌

By:  Tupaki Desk   |   8 Nov 2017 6:12 AM GMT
విప‌క్షాలు కోరితే అసెంబ్లీ స‌మావేశాల్ని కుదిస్తార‌ట‌
X
రోటీన్‌కు భిన్న‌మైన సీన్‌. స‌హ‌జంగా అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయంటే.. మ‌రిన్ని రోజులు నిర్వ‌హించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేయ‌టం.. అందుకు నో అంటూ అధికార‌ప‌క్షం వీలైనంత త‌క్కువ స‌మ‌యంలోనే స‌మావేశాల్ని ముగించాల‌ని భావించ‌టం క‌నిపిస్తుంది. కానీ.. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది.

ఎప్పుడూ లేని రీతిలో వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాల్ని 50 రోజులు నిర్వ‌హిస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చెప్పిన సంగ‌తి తెలిసిందే. అనుకున్న దాని కంటే ఎక్కువ రోజుల్ని నిర్వ‌హించేందుకు తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు సిద్ధం కావ‌టం విపక్షాల‌కు ఇబ్బందిగా మారింది. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా అధికార‌ప‌క్షం తీరును ప్ర‌జ‌లెంత మ‌దింపు చేస్తారో.. విపక్షాల‌కు ఇలాంటి స‌మ‌స్యే ఉంటుంది.

అధికార‌ప‌క్షాన్ని ఎంత‌లా ఇరుకున పెట్టారు? ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా విప‌క్షాలు ఎలా వ్య‌వ‌హ‌రించాయ‌న్న లెక్క ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు వేసుకోవ‌టం ఖాయం. ఎక్కువ రోజులు అసెంబ్లీని నిర్వ‌హించ‌టానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైన వేళ‌.. అందుకు త‌గ్గ‌ట్లు విప‌క్షాలు సిద్ధ‌మైన‌ట్లుగా క‌నిపించ‌లేదు. దీంతో.. అసెంబ్లీని ఎంత కాలం నిర్వ‌హిస్తారంటూ అధికార‌ప‌క్షాన్ని అడగ‌టం క‌నిపిస్తుంది.

అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో త‌ర‌చూ నిర్వ‌హించే స‌భా వ్య‌వ‌హారాల స‌ల‌హా క‌మిటీ తాజాగా స‌మావేశ‌మైంది. స‌మావేశాల్ని ఎప్ప‌టివ‌ర‌కూ నిర్వ‌హించాల‌న్న అంశంపై చ‌ర్చ జ‌రిపే ఉద్దేశంతో మీటింగ్ పెట్టినా.. దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోలేదు. ప్ర‌స్తుతానికి ఈ నెల 17 వ‌ర‌కు స‌భ‌ను నిర్వ‌హించాల‌ని..ఆ రోజున మ‌రోసారి స‌మావేశ‌మై ఎన్ని రోజులు అసెంబ్లీని నిర్వ‌హించాల‌న్న అంశంపై నిర్ణ‌యం తీసుకుందామ‌ని తీర్మానించారు.

ముఖ్య‌మంత్రి గైర్హాజ‌రు అయిన ఈ స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి.. ఉప స‌భాప‌తి ప‌ద్మా దేవంద‌ర్ రెడ్డి .. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వ‌ర్.. మంత్రులు హ‌రీశ్ రావు.. పోచారం.. ఈట‌ల‌తో పాటు విప‌క్ష నేత‌లు భ‌ట్టి విక్ర‌మార్క‌.. చిన్నారెడ్డి.. మ‌జ్లిస్ అక్బ‌రుద్దీన్‌.. బీజేపీ ఎన్వీఎస్ ప్ర‌భాక‌ర్‌.. టీడీపీ సంద్ర వెంక‌ట వీర‌య్య‌.. సీపీఎం సున్నం రాజయ్య‌.. శాస‌న‌స‌భా కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ స‌మావేశం సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశం చోటు చేసుకుంది. ఎప్పుడు విప‌క్షాలు స‌భ‌ను మ‌రికొంత కాలం పొడిగించాల‌న్న డిమాండ్‌కు భిన్నంగా.. ఎన్ని రోజులు నిర్వ‌హిస్తారో చెప్పాలో కోరారు. దీనికి మంత్రి హ‌రీశ్ స్పందిస్తూ.. విప‌క్షాలు కోరితే మొద‌ట అనుకున్న 50 రోజుల్ని కుదిస్తామ‌ని చెప్పారు. ప్ర‌శ్నోత్త‌రాల్ని ఏ రోజుకు ఆ రోజు పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించిన స‌భ్యులు.. ఈ నెల 17న మ‌రోసారి స‌మావేశ‌మై.. అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌న్న అంశంపై తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. మొత్తానికి ప్ర‌శ్న‌ల‌తో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే విప‌క్షాల‌కు.. తెలంగాణ స‌ర్కారు ఊహించ‌ని షాకిచ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.