Begin typing your search above and press return to search.

బకరా మినిస్టర్‌ ననుకున్నావా?

By:  Tupaki Desk   |   21 July 2016 12:30 PM IST
బకరా మినిస్టర్‌ ననుకున్నావా?
X
మంత్రిగారంటే భయం.. భక్తి రెండూ ఉండాలి. ఎంత కలుపుగోలుగా ఉంటే మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు కదా. పీపుల్స్ ఫ్రెండ్లీగా పిలుచుకునే మంత్రి హరీశ్ లాంటి నేత అగ్గి ఫైర్ అయ్యారంటే అది చిన్న కత కాదనే చెప్పాలి. రాజకీయ నేతల మీదా.. వైరి పక్షం మీద మండిపడే ఆయన.. ప్రజల మీదా.. అధికారుల మీదా విరుచుకుపడటం తక్కువనే చెప్పాలి.

కానీ.. తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన ఆయనలోని సహనానికి పరీక్ష పెట్టటమే కాదు.. మంటపుట్టేలా చేసింది. దీంతో ఆయన ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. అప్పటివరకూ మామూలుగా ఉన్న ఆయన.. హరీశ్ ఆగ్రహాన్ని చూసిన వెంటనే బిత్తర పోయారు. చేసిన తప్పునకు సారీ చెప్పేయటంతో హరీశ్ సైతం కూల్ అయిపోయారు. హరీశ్ అంతగా ఆగ్రహం చెందటానికి కారణం చూస్తే..

మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని సిర్గాపూర్ లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ ను.. తమ స్కూల్లో మొక్కలు నాటాలంటూ నల్లవాగు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్.. అధ్యాపకులు.. విద్యార్థులు హరీశ్ కాన్వాయ్ ను అపారు. మొక్కలు నాటేందుకు అంతగా ఉత్సాహం చూపిస్తే మంత్రిగారు కూడా కాదంటారా? సరేనని వాహనం దిగి పాఠశాలకు వెళ్లారు.

అయితే.. అక్కడకు వెళ్లే సరికి మొక్కలు నాటటానికి అవసరమైన గుంతలు మొదలుకొని.. పారా.. నీళ్లు ఏమీ ఏర్పాట్లు లేని పరిస్థితి. దీంతో ఒక్కసారి షాక్ తిన్న హరీశ్ అగ్గి ఫైర్ అయ్యారు. మొక్కలు నాటేందుకు పిలిచారు.. ఇక్కడ ఏర్పాట్లు ఏంది? బకరా మినిస్టర్ అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. ప్రిన్సిపల్ జరిగిన తప్పునకు క్షమాపణలు చెప్పాలని ప్రాధేయపడటంతో కూల్ అయిన హరీశ్ తానే స్వయంగా మట్టి తీసి గుంతను ఏర్పాటుచేసి.. మొక్కను నాటి వెళ్లిపోయారు. ఎంత ఫ్రెండ్లీ మినిస్టర్ అయితే మాత్రం.. అలక్ష్యంతో మంత్రి చేతనే గుంతులు తీయిస్తారా?