Begin typing your search above and press return to search.

హరీష్ మంత్రాంగం.. రేవంత్ ఓడుతాడా.?

By:  Tupaki Desk   |   16 Nov 2018 12:48 PM GMT
హరీష్ మంత్రాంగం.. రేవంత్ ఓడుతాడా.?
X
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో హోరాహోరీ నెలకొంది. రేవంత్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో - టీఆర్ ఎస్ ఎత్తుకు పెఎత్తు వేస్తుంది. మంత్రి హరీష్ రావు దృష్టి పెట్టి మంత్రాంగం నడుపుతున్నారు. ఎలాగైనా కారు పరం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు రేవంత్ కూడా అదే స్థాయిలో రాజకీయ ప్రచారం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలుపొంది.. మూడో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009లో టీడీపీ తరుపున బరిలోకి దిగి విజయం సాధించారు. 2014లో మల్కాజ్ గిరి పార్లమెంటును కోరుకాగా - చంద్రబాబు మల్లారెడ్డికి అవకాశం కల్పించారు. దాంతో మరలా 2014లో మరలా కొడంగల్ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపారు. కానీ, స్పీకర్ కు చేరకపోవడంతో ఉప ఎన్నిక రాలేదు.

కాగా, రేవంత్ రాజీనామా చేసిన అనంతరం మంత్రి హరీష్ రావు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. అప్పటికే భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రచారం మొదలుపెట్టారు. ఇటీవలి కాలంలో ఇబ్బడిముబ్బడిగా నిధులు మంజూరు చేసింది. ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు రూ.100 కోట్లు - పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ.194 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. కొడంగల్‌ - కోస్గి - మద్దూరుల్లోని ప్రభుత్వాసుపత్రుల భవనాల నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్‌ - కోస్గి మునిసిపాలిటీలకు రూ.30 కోట్లు - కోస్గిలో బస్‌ డిపోనకు రూ.3 కోట్లు మంజూరు చేశారు.

అలాగే, రేవంత్‌ రెడ్డి అందజేసిన రూ.5 కోట్లతో కొడంగల్‌ - కోస్గి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించారు. ఆయన సొంత డబ్బులతో మూడెకరాలు కొనుగోలు చేసి కోస్గికి బస్‌ డిపో మంజూరు చేయించారు. అయితే రేవంత్ ఏమీ చేయలేదని నాయకులు వివరిస్తూ టీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున్న ప్రచారం చేయించుకుంటున్నారు. టీఆర్ ఎస్ తరుపున మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేంద్ రెడ్డి పోటీకి దిగారు. గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మరోవైపు ప్రచార బాధ్యతలను రేవంత్ సోదరులు తిరుపతిరెడ్డి - కొండల్‌ రెడ్డి - కృష్ణారెడ్డి - రమేశ్‌ రెడ్డికి అప్పగించారు. ఆయన ఇతర నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. ఇతర సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేస్తుంటారు. మరో వైపు టీఆర్ ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి విజయం కోసం మంత్రి హరీష్ రావు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మహేందర్ రెడ్డి కూడా కొడంగల్‌పై ప్రత్యేకంగా కేంద్రీకరించారు. రేవంత్ ఓటమే లక్ష్యంగా టీఆర్ ఎస్ వేస్తున్న ఎత్తులు ఫలిస్తాయో.. లేదా చతికిలపడతారోనని విశ్లేషకులు అంచనాలు వేసుకుంటున్నారు.