Begin typing your search above and press return to search.

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు: కీల‌క సీన్లో హ‌రీశ్..!

By:  Tupaki Desk   |   13 Dec 2017 4:45 AM GMT
ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు: కీల‌క సీన్లో హ‌రీశ్..!
X
ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షంలో రెండు గ్రూపులు ఉన్నాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. అయితే.. పెద్దాయ‌న కేసీఆర్ మీద ఉన్న భ‌యంభ‌క్తుల కార‌ణంగా ఎవ‌రూ క‌ట్టుదాటేందుకు.. ల‌క్ష్మ‌ణ రేఖను దాటేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌రు. ఎవ‌రికి వారు మ‌న‌సులో ఉన్న బాధ‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంటారు.

త‌మ స‌న్నిహితుల వ‌ద్ద మాత్రం ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. అయితే.. ఇదంతా గుట్టుగా సాగుతుంది. ఒకరిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌టం.. ర‌చ్చ చేసుకోవ‌టం అన్న‌ది అస్స‌లు ఉండ‌దు. ఈ కార‌ణంతోనే బ‌య‌ట‌కు అంతా బాగున్న‌ప్ప‌టికి గులాబీ గూట్లో లుక‌లుక‌లు ఎక్కువే.

నిజానికి ఈ విష‌యాల‌న్నీ మీడియా మిత్రుల‌కు తెలియంది కాదు. మ‌రి.. తెలిసిన విష‌యాలు వార్త‌ల రూపంలో రావెందుక‌న్న డౌట్ అక్క‌ర్లేదు. ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార‌ప‌క్షానికి ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు దాదాపుగా విన‌య విధేయ‌త‌ల‌తో ప‌ని చేస్తుండ‌ట‌మే. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా.. అధికార‌ప‌క్ష ఇమేజ్ కు డ్యామేజ్ జ‌ర‌గ‌కుండా వార్త‌లు వండించే విధానం గ‌డిచిన కొంత కాలంగా సాగుతూనే ఉంది.

తెలంగాణ అధికార‌ప‌క్షంలో కేసీఆర్ కేంద్రంగా ఉంటే.. కింద లేయ‌ర్లో కేటీఆర్.. హ‌రీశ్ రావు.. క‌విత అనే మూడు లేయ‌ర్లు ఉన్నాయి. అయితే.. అన్న‌కు ఒదిగి ఉండే క‌వితతో దాదాపుగా గొడ‌వే ఉండ‌ద‌ని చెబుతారు. ఆమెకు సంబంధించిన ఇష్యూల‌లో ఎవ‌రూ వేలు పెట్ట‌క‌పోతే చాలంటారు. ఇక‌.. కేటీఆర్.. హ‌రీశ్ రావుల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తుంటాయి. కొన్ని జిల్లాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో హ‌రీశ్ చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంటుంది. ఎక్కువ‌గా పార్టీలోకి నేత‌ల్ని తీసుకొచ్చే విష‌యంలో ఆయ‌న కీల‌క భూమిక పోషిస్తుంటారు.

ఇక‌.. కేటీఆర్ విష‌యానికి వ‌స్తే.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి సంబంధించిన అన్ని బాధ్య‌త‌లు ఆయ‌న‌కు కేసీఆర్ ఇప్ప‌టికే ద‌ఖ‌లు చేయ‌టం తెలిసిందే. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే బాధ్య‌త‌తో పాటు.. త‌న‌ను తాను షోకేస్ చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని అవ‌కాశాలు కేసీఆర్ ఇస్తార‌ని చెబుతారు. ఎవ‌రికి వారికి వారి పాత్ర‌లేమిటో త‌న చేత‌ల ద్వారా కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పేస్తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తుంటుంది.

గ‌డిచిన కొంత‌కాలంగా హ‌రీశ్‌ ను అభిమానించే వ‌ర్గం తీవ్ర అసంతృప్తితో ఉంద‌ని చెబుతుంటారు. ప్ర‌పంచ స్థాయిలో హైద‌రాబాద్ న‌గ‌రానికి గుర్తింపు తెచ్చిన జీఈఎస్ స‌ద‌స్సుతో పాటు హైద‌రాబాద్ మెట్రో రైలు వ్య‌వ‌హారంలోనూ కేటీఆర్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. త‌న మార్క్‌ను వేశారు. ఈ రెండు ఈవెంట్ల‌లో హ‌రీశ్ మ‌చ్చుకు క‌నిపించ‌లేదు. చివ‌ర‌కు మెట్రో రైలులో హ‌రీశ్ ఎక్కింది లేదు. ఎందుకంటే.. అది త‌న జోన్ కాద‌న్న విష‌యం హ‌రీశ్ కు తెల‌వ‌ట‌మే.

ఇదిలా ఉంటే..ఇటీవ‌ల ఇరిగేష‌న్ ప్రాజెక్టుల ప‌నితీరుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన వైనం హ‌రీశ్ వ‌ర్గాన్ని బాధించింద‌ని చెబుతారు. కాలుకు బ‌ల‌పం క‌ట్టుకొని మ‌రీ తిరిగిన హ‌రీశ్ శ్ర‌మ‌ను త‌క్కువ చేసిన‌ట్లుగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌న్న గుర్రు హ‌రీశ్ వ‌ర్గంలో ఉన్న‌ట్లు చెబుతారు. అయితే.. ముఖ్య‌మంత్రి మీద ఉన్న భ‌యం..భ‌క్తితో త‌మ భావాల్ని త‌మ లోప‌లే దాచేసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా టీటీడీపీ నేత ఉమామాధ‌వ రెడ్డి గులాబీ గూట్లోకి రావ‌టానికి రాయ‌బారం న‌డిపిన వారిలో హ‌రీశ్ కీల‌క‌భూమిక పోషించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే.. ఉమామాధ‌వ రెడ్డి ఆమె త‌న‌యుడు సీఎం కేసీఆర్‌ ను క‌లిసిన‌ప్పుడు.. వారితో మంత్రి హ‌రీశ్ ఉండ‌టం దీనికి నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఏమైనా.. ఇటీవ‌ల కాలంలో ఏ పెద్ద ఈవెంట్లో క‌నిపించ‌ని హ‌రీశ్‌.. తాజా చేరిక‌లో క‌నిపించ‌టంపై హ‌రీశ్ వ‌ర్గీయులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.