Begin typing your search above and press return to search.

రానున్న రోజుల్లో కాబోయే కీ ప్లేయ‌ర్ హ‌రీశేనా?

By:  Tupaki Desk   |   31 Oct 2018 3:30 PM GMT
రానున్న రోజుల్లో కాబోయే కీ ప్లేయ‌ర్ హ‌రీశేనా?
X
రాజ‌కీయ అంశాల్ని రిపోర్ట్ చేయ‌టంలో గ‌తానికి.. వ‌ర్త‌మానానికి మ‌ధ్య వ్య‌త్యాసం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. గ‌తంలో రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చెప్పే ప్ర‌య‌త్నం మ‌హా చ‌క్క‌గా ఉండేది. దీనికి మీడియా సంస్థ‌ల అధినేత‌లు సైతం జోక్యం చేసుకునే వారు కాదు. మ‌రీ.. ఇబ్బంది అయినా.. వారి నియంత్ర‌ణ కాస్త త‌క్కువ‌గా ఉండేది. కానీ.. మారిన కాలంలో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది.

గ‌తంలో లోగుట్టుగా జ‌రిగే ప‌రిణామాల్ని రిపోర్ట్ చేసే ప‌రిస్థితి నుంచి.. ఇప్పుడు లోగుట్టుగా సాగుతున్న వ్య‌వ‌హారం అంటూ క‌ల్పిత క‌థ‌నాల్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు సైతం రిపోర్ట్ చేయ‌టం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. దీంతో.. ఏది నిజం? ఏది క‌ల్పితం? అన్న‌ది పాత్రికేయంలో ప‌ని చేస్తున్న వారికి సైతం అర్థం కాని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇక‌.. సోష‌ల్ మీడియా సీన్లోకి వ‌చ్చేసి.. ఎవ‌రికి తోచింది వారు చెప్పేసుకోవటం.. ఆ మాట‌ల‌న్నీ వైర‌ల్ కావ‌టం మామూలైంది. దీంతో.. అదేదో జ‌రిగింద‌ట‌.. అలా చేశార‌ట‌.. అంటూ.. "ట" అనే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఇక‌.. కొన్ని ముఖ్య‌మైన మీడియా సంస్థ‌లు సైతం "ట‌"ను ఎక్కువ‌గా వాడ‌టం పెరిగింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. న్యాయ‌సంబంధంమైన త‌ల‌నొప్పులు ఎదుర్కొనే క‌న్నా.. గోడ మీద పిల్లి వాటంగా ఉంటే స‌రిపోతుంద‌న్న భావ‌నే తాజా ప‌రిస్థితి కార‌ణంగా చెబుతున్నారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల పుణ్య‌మా అని కేసీఆర్.. కేటీఆర్.. హ‌రీశ్‌ ల‌కు సంబంధించిన కొన్ని అంశాల మీద ఆస‌క్తిక‌ర ప్ర‌చారం సాగుతోంది. అంద‌రి కంటే ఎక్కువ‌గా హ‌రీశ్ మీద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఆ మ‌ధ్య వ‌ర‌కూ మేన‌మామ‌కు థోకా ఇస్తార‌ని.. బీజేపీలో చేరుతున్న‌ట్లుగా ప్ర‌చారం సాగింది. అయితే.. హ‌రీశ్ ఏమైనా పిచ్చోడా? ఆయ‌న‌కున్న రాజ‌కీయ అనుభ‌వం.. వేసే ఎత్తుల్ని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తే.. వారికి మించిన పిచ్చోడు మ‌రొక‌రు ఉండ‌రు.

రాబోయే ప‌దేళ్ల‌లో ఏం జ‌రుగుంది? త‌న స్థానం ఏమిటి? త‌న వ‌ర్గం ఏమిటి? అన్న లెక్క‌ల విష‌యంలో హ‌రీశ్ చాలా క‌చ్ఛితంగా ఉంటారు. పార్టీ ప‌త్రిక‌గా చెప్పుకునే న‌మ‌స్తే తెలంగాణ‌లో త‌న ఫోటో వాడ‌ని వైనంపైనా.. త‌న వార్త‌ల‌కు ఇచ్చే అప్రాధాన్య‌త మీద ఆయ‌న‌కు కినుకు లేక‌పోలేదు. అయితే.. మ‌న‌సులో ఎంత బాధ ఉన్న‌ప్ప‌టికీ.. దాన్ని స‌న్నిహితుల వ‌ద్ద కూడా ఎక్కువ‌గా చెప్ప‌కుండా.. ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం హ‌రీశ్ గొప్ప‌త‌నంగా చెప్పాలి.

త‌న‌ను ఎంత‌గా తొక్కేస్తే.. అంత మంచిద‌న్న భావ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు ఉంటారు. ఎందుకంటే.. తానేమిట‌న్న విష‌యం ఆయ‌న‌కు బాగా తెలియ‌టం.. టీఆర్ఎస్‌లో త‌న‌కున్న ప‌ట్టు మీద ఆయ‌న‌కున్న న‌మ్మ‌క‌మే చెప్పాలి. తొంద‌ర‌ప‌డ‌టానికి మించిన త‌ప్పుడు ప‌ని మ‌రొక‌టి ఉండ‌ద‌న్న భావ‌న‌తో ఉండే హ‌రీశ్‌.. గ‌తంలో మాదిరి వ‌ర్త‌మానంలోనూ ఆయ‌న తొంద‌ర‌ప‌డ‌కుండా ఆచితూచి అన్న‌ట్లుగా అడుగులు వేస్తున్న‌ట్లు చెప్పాలి.

తాజాగా జ‌రిగే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి 30 నుంచి 40 సీట్లు వ‌స్తే.. కీ మొత్తాన్ని తిప్పేది హ‌రీశే అవుతార‌ని చెబుతున్నారు. ఆ విష‌యం హ‌రీశ్ కు కూడా బాగా తెలుస‌ని.. త‌న‌దైన రోజు కోసం ఆయ‌న వెయిట్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అవున‌న్నా కాద‌న్నా.. త‌న మేన‌మామ కార‌ణంగానే తానీ రోజున ఈ స్థాయిలో ఉన్న విష‌యాన్ని హ‌రీశ్ మ‌న‌స్ఫూర్తిగా న‌మ్ముతార‌ని చెబుతారు.

మేన‌మామ కేసీఆర్ అంటే హ‌రీశ్ కు ఎంతో అభిమాన‌మ‌ని.. అందుకే.. ఆయ‌న కార‌ణంగా త‌న మ‌న‌సు నొచ్చుకున్నా బ‌య‌ట‌కు చెప్ప‌కుండా ఉంటార‌ని చెబుతారు. త‌న మౌన‌మే త‌న‌కు ఆయుధ‌మ‌ని.. అదే త‌న‌కు ఆభ‌ర‌ణంగా మారి.. రానున్న రోజుల్లో వ‌రంగా మారుతుంద‌న్న విశ్లేష‌ణ చేస్తారు. ఈ విష‌యం తెలిసే.. హ‌రీశ్ ను ఎంత‌లా ప‌క్క‌న పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌కేటీఆర్‌ కు.. అది అంత కుద‌ర‌టం లేద‌ని స‌మాచారం. త‌న విష‌యంలో పార్టీ చేస్తున్న త‌ప్పుల చిట్టాను హ‌రీశ్ జాగ్ర‌త్త‌గా లెక్క‌లేసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ చెప్పిన‌ట్లుగా బంప‌ర్ మెజార్టీ వ‌స్తే.. హ‌రీశ్ ప్ర‌భ కాస్త మ‌స‌క‌బారుతుంద‌ని.. అందుకు భిన్నంగా ఫ‌లితాలు వ‌స్తే మాత్రం.. హ‌రీశ్ కీ రోల్ ప్లేచేయాల్సి వ‌స్తుందని.. అప్పుడు ఆయ‌న స‌త్తా ఏమిటో అంద‌రికి తెలిసేలా ప‌రిణామాలు ఉంటాయంటున్నారు.