Begin typing your search above and press return to search.

గులాబీ బ్యాచ్ లో హ‌రీశ్ ను ఏకాకిని చేసేశారా?

By:  Tupaki Desk   |   16 March 2019 4:40 AM GMT
గులాబీ బ్యాచ్ లో హ‌రీశ్ ను ఏకాకిని చేసేశారా?
X
టీఆర్ ఎస్ లో ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఒక‌ప్పుడు కేసీఆర్ కు కుడిభుజంగా వ్య‌వ‌హ‌రించిన హ‌రీశ్ ను ఒక ప‌థ‌కం ప్ర‌కారం ఆయ‌న ప్రాధాన్య‌త‌ను అంత‌కంత‌కూ త‌గ్గిస్తున్న వైనం ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చ‌ర్చ‌గా మారుతోంది.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. టీఆర్ ఎస్ లో కేటీఆర్ బ్యాచ్.. హ‌రీశ్ బ్యాచ్ అన్న‌ది ఉంది. నేత‌లు సైతం త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఈ ఇద్ద‌రి నేత‌ల మీద ఉన్న అభిమానాన్ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. హ‌రీశ్‌.. కేటీఆర్ మ‌ధ్య విభ‌జ‌న రేఖ స్ప‌ష్టంగా ఉన్న‌ట్లుగా చెప్పే గులాబీ నేత‌ల‌కు కొద‌వ లేదు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. హ‌రీశ్ ను అభిమానించే ప‌లువురు నేత‌లు కేటీఆర్ బ్యాచ్ లో క‌నిపిస్తారు. అదే స‌మ‌యంలో కేటీఆర్ కు స‌న్నిహితులు.. ఆయ‌న వ‌ర్గంలోని వారు మాత్రం హ‌రీశ్ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ని వైనం క‌నిపిస్తూ ఉంటుంది.-పార్టీలో మారిన బ‌లాబ‌లాల‌కు త‌గ్గ‌ట్లు కేటీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా కేటీఆర్ మారితే.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితిని హ‌రీశ్ ఎదుర్కొంటున్న‌ట్లు చెబుతున్నారు.

బావ‌..బావ‌మ‌రిదులు ఇద్ద‌రు క‌లిసిన‌ప్పుడు మాట్లాడుకునే తీరు.. ఒకరికొక‌రు గౌర‌వ మ‌ర్యాద‌ల్ని ఇచ్చుకునే తీరు చూసే వారిని ఆక‌ట్టుకునేలా ఉంటుంద‌ని చెప్పాలి. పైకి అంతా బాగున్న‌ట్లు ఇద్ద‌రూ వ్య‌వ‌హ‌రించినా.. లోప‌ల మాత్రం అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంద‌న్న మాటను ఎవ‌రూ కొట్టిపారేయ‌టం క‌నిపించ‌దు. హ‌రీశ్ విష‌యంలో కేసీఆర్ ప్ర‌యారిటీలో మార్పు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న క‌నిపించినంత‌నే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లే నేత‌ల సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గుతోంద‌న్న మాట వినిపిస్తోంది. హ‌రీశ్ కు ద‌గ్గ‌ర‌న్న అభిప్రాయం క‌లిగిన నేత‌ల‌కు త‌గిలే ఎదురుదెబ్బ‌ల్ని అర్థం చేసుకుంటున్న గులాబీ నేత‌లు ప‌లువురు ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నారు.

త‌న కార‌ణంగా లేనిపోని ఇబ్బందుల‌కు గురి అవుతున్న వైనాన్ని గుర్తించిన హ‌రీశ్‌.. త‌న‌కు తానే దూరంగా ఉంటూ.. త‌న ప‌ని ఏమిటో తాను చేసుకుపోతున్న వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇటీవ‌ల ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్నే చూస్తే.. పోలింగ్ సంద‌ర్భంగా క‌నిపించిన సీన్ చూస్తే.. పార్టీలో ప‌రిస్థితి ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలుంతా పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి బ‌స్సులో వ‌స్తే.. హ‌రీశ్ మాత్రం అందుకు భిన్నంగా త‌న కారులో ఒక్క‌డిగా రావ‌టం.. ఓటు వేయ‌టం క‌నిపించింది. ఈ విష‌యం మీడియాలో పెద్ద‌గా క‌వ‌ర్ కాకున్నా.. ప్ర‌త్య‌క్షంగా చూసిన వారు మాత్రం ఇలాంటి సీన్లు గ‌తంలో చూడ‌లేదంటున్నారు. ఓటు వేసేందుకు వ‌చ్చిన హ‌రీశ్ తో ప‌లువురు గులాబీ ఎమ్మెల్యేలు అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌ని.. హ‌రీశ్ సైతం వారిని అట్టే ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌న్న‌ట్లుగా వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. హ‌రీశ్ ను ఇంత‌లా ఏకాకిని చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న మాట గులాబీ నేత‌ల నోటి నుంచి వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.