Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 'లైన్' దాటి మాట్లాడిన హరీశ్

By:  Tupaki Desk   |   5 Dec 2019 9:11 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. లైన్ దాటి మాట్లాడిన హరీశ్
X
పిలిస్తే వచ్చామా? హాజరు వేయించుకున్నామా? తిరిగి ఇంటికి వెళదామా? అన్నట్లే సాగుతోంది తెలంగాణ రాష్ట్ర ముంత్రుల వ్యవహారశైలి చూస్తే. సీఎం కేసీఆర్ కాబినెట్ లో గొంతు విప్పి మాట్లాడేది ఆయన పుత్రరత్నం కమ్ మంత్రి కేటీఆర్ మాత్రమే. ఆయన్ను మినహాయిస్తే మిగిలిన వారంతా తమ పరిధికి కిలోమీటరు ముందే ఆగిపోతున్న పరిస్థితి. దీంతో.. తెలంగాణ రాష్ట్ర పాలన మొత్తం కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి మేనల్లుడు..తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో కీలకభూమిక పోషించిన హరీశ్ సైతం తన పరిధిని దాటి ఒక్క అంగుళం ముందుకు వేయటానికి ఇష్టపడని పరిస్థితి.

52 రోజుల పాటు సాగిన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలోనూ పెదవి విప్పకుండా జాగ్రత్త పడ్డారన్న మాట పడ్డారు హరీశ్. దీనికి కారణం లేకపోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల్ని ఏకతాటి మీదకు తీసుకురావటం.. టీఆర్ ఎస్ అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేయటంలో హరీశ్ పాత్రను ఎవరూ మర్చిపోలేరు.

తాను పెంచి పెద్దది చేసిన సంఘానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన లైన్ తెలిసిన హరీశ్.. తన పరిధిని దాటేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. అధినేత మనసును అర్థం చేసుకొని మసులుకోవటం హరీశ్ లాంటి నేతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతసేపటికి తన నియోజకవర్గం.. తన మంత్రిత్వ శాఖ.. అది కూడా బయటకు పెద్దగా ఫోకస్ కాని రీతిలో అండర్ ప్లే చేస్తున్న మరీశ్ తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించి వార్తల్లోకి వచ్చారు.

సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన హరీశ్.. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ను విపరీతంగా పొగిడేశారు. సీఎఫ్ వో పాత్ర మానవ శరీరంలో గుండెకాయ లాంటిదని అభివర్ణించిన మంత్రి.. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ విపరీతంగా కృషి చేస్తున్నట్లుగా ప్రశంసించారు. పరిశ్రమలకు ప్రోత్సాహాలు త్వరగా విడుదల చేయాలని కేటీఆర్ తనపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సరదాగా వ్యాఖ్యానించారు.

ఇటీవల కాలంలో తన పాత్ర ఎంతో అంతకు మించి ఒక్క అంగుళం కూడా ముందుకు వేయనట్లుగా వ్యవహరించే హరీశ్.. చాలా కాలం తర్వాత కాస్తంత ఫ్రీహ్యాండ్ తో చేసిన వ్యాఖ్యలుగా చెప్పాలి. మొత్తానికి కేటీఆర్ బాగా పని చేస్తున్న కితాబు హరీశ్ నోటి వెంట రావటం ఆసక్తికరంగా చెప్పాలి. అంతేకాదు.. ఈ తరహా సదస్సులకు తక్కువగా హాజరయ్యే మంత్రి హరీశ్.. తన మాటలతో అక్కడి వారి మనసుల్ని దోచుకోవటం గమనార్హం.