Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఓట‌మి వాళ్ల‌ పై నెట్టేసిన హ‌రీష్‌ రావు

By:  Tupaki Desk   |   2 Nov 2021 3:39 PM GMT
హుజూరాబాద్ ఓట‌మి వాళ్ల‌ పై నెట్టేసిన హ‌రీష్‌ రావు
X
ఆరు నెల‌లు గా తెలంగాణ రాజ‌కీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక విజేత ఎవ‌రో ఈ రోజు తేలి పోయింది. ఉత్కంఠ‌ కు తెర‌ దించుతూ అభివృద్ధి నినాదం పై ఈట‌ల ఆత్మ‌ గౌర‌వ నినాదం విజ‌యం సాధించింది. ఈట‌ల టార్గెట్‌ గా రోజుల త‌ర‌ బ‌డి సాగిన ఫేక్ ప్ర‌చారాలు ఫెయిల్ అయ్యాయి. నాగార్జునా సాగ‌ర్లో కొత్త కుర్రాడి ని నిల‌బెట్టి... కాక‌లు తీరిన జానారెడ్డి నే ఓడించాం.. అస‌లు త‌మ‌కు ఇక్క‌డ ఈట‌ల పోటీయే కాద‌ని బీరాలు పోయిన టీఆర్ఎస్ నేత‌ల‌కు దిమ్మ‌తిరిగే తీర్పు ఈ రోజు హుజూరాబాద్ ఓట‌రు ఇచ్చారు. ఈట‌ల రాజేంద‌ర్ 23 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీ తో ఘ‌న‌ విజ‌యం సాధించారు. క‌మ‌లాపూర్‌, హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఆయ‌న ఏడో సారి ఎమ్మెల్యే గా విజ‌యం సాధించి.. ఓట‌మి లేని నేత‌ గా రికార్డుల‌ కు ఎక్కారు. ఆయ‌న గ‌త ఆరు గెలుపుల‌కు..ఈ గెలుపున‌కు తేడా ఒక్క‌టే. గ‌తం లో ఆరు సార్లు టీఆర్ఎస్ నుంచి గెలిచి డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు ఏడో సారి బీజేపీ నుంచి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కుతున్నారు.

ఇక ఈ ఉప ఎన్నిక ఫ‌లితం పై కేసీఆర్‌ కు ముందు నుంచి డౌట్ ఉందా ? అన్న సందేహం ఉంది. తెలంగాణ లో టీఆర్ఎస్ గెలిచిన ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి అన్ని సార్లు కేసీఆర్ వెళ్లారు. అయితే పార్టీ ఓడిపోయిన దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారాని కి మాత్రం ఆయ‌న దూరం గా ఉన్నారు. అయితే ఈ రెండు ఉప ఎన్నిక‌ల బాధ్య‌త‌లు మాత్రం కేసీఆర్ హ‌రీష్‌ రావు చేతుల్లోనే పెట్టారు. దుబ్బాక‌ లో హ‌రీష్ ర‌ఘు నంద‌న్‌ రావును ఓడించేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా ఆయ‌న విజ‌యం సాధించారు.

ఇక ఇప్పుడు ఈట‌ల‌ ను ఓడించేందుకు హ‌రీష్‌ రావు త‌న టీం తో రెండు నెల‌లుగా హుజూరాబాద్‌ లో నే మ‌కాం వేశారు. త‌న స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. ఒకా నొక ద‌శ‌ లో హ‌రీష్ వ‌చ్చాక హుజూరాబాద్‌ లో సీన్ మారి పోయింద‌ని.. టీఆర్ఎస్‌ కు అనుకూల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈ రోజు ఫ‌లితం చూస్తే హ‌రీష్ మంత్రాంగం ప‌ని చేయ‌లేద‌ని తేలింది. ఈ ఫ‌లితాల‌ పై ఆయ‌న మీడియా తో మాట్లాడారు.

ప్ర‌జా తీర్పు శిర‌సావ‌హిస్తామంటూనే.. టీఆర్ఎస్ ఓట్లేమి త‌గ్గ‌ లేద‌న్నారు. దేశం లోనే ఎక్క‌డా లేని విధంగా ఈ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ ను ఓడించేందు కు కాంగ్రెస్ + బీజేపీ క‌లిసి ప‌ని చేశాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్లే ఒప్పుకున్నార‌ని.. రాష్ట్ర ప్ర‌జ‌లు అంతా ఈ విష‌యం గ‌మ‌నిస్తున్నార‌ని హరీష్ తెలిపారు. ఇక టీఆర్ఎస్ ఒక్క ఓట‌మి తో కుంగిపోద‌ని.. ఎప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్షానే పోరాడుతుంద‌ని చెప్పారు.