Begin typing your search above and press return to search.

మంత్రి పదవికి హరీశ్ రాజీనామా సవాలు.. కండీషన్ ఇదేనట

By:  Tupaki Desk   |   24 Oct 2021 7:32 AM GMT
మంత్రి పదవికి హరీశ్ రాజీనామా సవాలు.. కండీషన్ ఇదేనట
X
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార..విపక్ష పార్టీల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. హైటెన్షన్ పోల్ వార్ గా మారిన ఈ ఉప ఎన్నిక ఇరు వర్గాలకు అత్యంత కీలకం కావటంతో ఎవరికి వారు.. పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటివేళ.. టీఆర్ఎస్ నేతలు ఈటల వ్యక్తిగత ఇమేజ్ తో పాటు.. కేంద్రం.. రాష్ట్రంఅన్న బూచిని చూపిస్తూ.. ఓట్లను దండుకునే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.291గా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారని.. అది అబద్ధమని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ఒకవేళ.. వారు చెప్పినట్లుగా నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.

పెట్రోల్.. డీజిల్ ధరల్ని కొద్దికొద్దిగా పెంచుకుంటూ పోయారని.. పెట్రోల్ మీద కొత్తగా రూ.28.. పాతది రూ.10 కలిపి లీటరుకు రూ.38 వసూలు చేస్తున్నారన్నారు. బడ్జెట్ కు సంబంధించిన పుస్తకాల్ని తీసుకొని కిషన్ రెడ్డి రావాలని.. టీవీ చానల్ లో చర్చకు కానీ.. బహిరంగ చర్చకు కానీ తాను సిద్ధమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాలు విసిరారు. దమ్ముంటే ఆయన తన సవాల్ ను స్వీకరించాలన్నారు.

కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఇబ్బందికి గురి కాకుండా రైతుబంధు పథకాన్ని అమలు చేసిన వైనాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో సొంత స్థలాలు ఉన్న వారికి రూ.నాలుగైదు లక్షలు ఇచ్చి సొంత ఇంటిని కట్టుకునేందుకు సాయం చేస్తామన్నారు. టీఆర్ఎస్ సంపద పెంచిందని.. రైతుల అప్పు మాఫీ చేసిందన్న హరీశ్.. బీజేపీ పేద రైతులకు పన్నులు పెంచి బడా పారిశ్రామికవేత్తలకు అప్పుల్ని మాఫీ చేసిందన్నారు. హుజూరాబాద్ రైతులు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు. మరి.. హరీశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నసవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.