Begin typing your search above and press return to search.

వాట్సాప్ తో వెయ్యి ఎక‌రాల‌ను కాపాడిన హ‌రీశ్

By:  Tupaki Desk   |   14 April 2017 11:03 AM GMT
వాట్సాప్ తో వెయ్యి ఎక‌రాల‌ను కాపాడిన హ‌రీశ్
X
మాస్ లీడ‌ర్ అనే పేరున్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు త‌న దృష్టికి వ‌చ్చిన అంశాల విష‌యంలో ఎలా స్పందిస్తార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. త‌న‌కు వ‌చ్చిన ఓ వాట్స‌ప్ మెసేజ్‌ కు స్పందించిన హ‌రీశ్ రావు అధికారుల‌ను అప్రమత్తం చేయడంతో దాదాపు వెయ్యి ఎకరాల పంటను ఎండిపోకుండా కాపాడగ‌లిగారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన యంత్రాంగం మూడు రోజులుగా రేయింబవళ్లు శ్రమకోర్చి పంట పొలాలకు నీళ్లందించారు. తూము సమస్యతో సతమతమై నీళ్లురాక ఎండిన పొలాలకు జీవం పోశారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపేట గ్రామంలోని పంగిడి చెరువుగా పిలిచే చెరువు నీరు పంట పొలాలకు రాక యాసంగి రైతులు గోస పడుతున్నారు. పొట్టకొచ్చిన వరి పంట చేతికి రాదేమోమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గ్రామానికి చెందిన ఒక రైతు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావుకు వాట్సప్ ద్వారా తమ చెరువు కష్టాలను మెసేజ్ చేశారు. `మా ఊరి చెరువుకు ప్రాబ్లమ్ ఉంది. అశ్వరావుపల్లి రిజర్వాయర్ చెరువు తూము ప్రాబ్లమ్ ఉంది. నాలుగు నెలల నుంచి ఏదో తట్టుకోవడంతో వాటర్ సరిగా రావడం లేదు. చెరువు నుంచి నీరు రాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. అందరు వచ్చిపోతున్నారున. కానీ , సమస్య పరిష్కారం కావడం లేదు. ఎలాగైనా మీరు మా ఊరి చెరువు సమస్య పరిష్కరించి ఎండి పోతున్న పంటలు కాపాడాలని కోరుతున్నాం` అంటూ ఈనెల 9న మంత్రి హరీశ్‌ రావుకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చదివిన మంత్రి హరిశ్‌ రావు తక్షణమే స్పందించి దేవాదుల ఎత్తిపోతల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం క్షేత్రపర్యటన చేసి సమస్యను పరిష్కరించి రైతులకు నీరందించాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాలను అందుకున్న దేవాదుల అధికారులు సీఈ - ఎస్‌ ఈ - ఈఈలు రంగంలోకి దిగారు. సమస్యను సావదానంగా పరిశోధించారు. అశ్వరావుపల్లిలో పంగిడి చెరువుగా స్థానికులు పిలుచుకునే చెరువు కింద ఆయకట్టు రికార్డుల్లో 540 ఎకరాలు కాగా వాస్తవానికి 1040 ఎకరాల ఆయకట్టు ఉంది. వరి పొట్టకొచ్చిన స‌మ‌యంలో నీటి తడి కోసం రైతులు తండ్లాడుతున్నారు. చెరువులో దాదాపు 18 అడుగులకు ఎక్కువగా నీళ్లున్నప్ప‌టికీ ప్రధాన సమస్య పంగిడి చెరువు తూము నుంచి నీరు బయటికి రావడం లేదు. తూములో పది అడుగుల లోతు - దూరం చెరువు నుంచి లోపల మేట - ఇసుక - ఇసుక బస్తాలతో నిండి ఉంది. దీంతో తర్జన బర్జన పడిన అధికారులు ప్ర‌త్యామ్నాయం చూపారు. 50 హెచ్‌ పీ మోటర్లు - జనరేటర్లు ఆగమేఘాలమీద అక్కడికి తెప్పించి దాదాపు 1040 ఎకరాలకు నీళ్లిచ్చే పనికి పూనుకున్నారు. ఇలా, ఎండి పోతున్న తమ వరి పంటకు నీళ్లు రావడం మొద లు కావడంతో అశ్వరావుపల్లి రైతులు ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. సకాలంలో స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి ఈ చెరువు నీటి పారుదల శాఖ (చిన్ననీటి పారుదల) అధికారులు చూసుకోవాల్సింది. అయితే సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని స్వయంగా మంత్రే ఆదేశించడంతో దేవాదుల ఎత్తిపోతల పథకం ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించి రైతులకు నీళ్లిచ్చే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తంగా మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు 48 గంటల్లోనే వరి పంటను కాపాడడంతో స్థానిక రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/