Begin typing your search above and press return to search.

ఏపీ పరిస్థితులు తెలంగాణకు అనుకూలం: హరీష్

By:  Tupaki Desk   |   29 Dec 2019 11:48 AM IST
ఏపీ పరిస్థితులు తెలంగాణకు అనుకూలం: హరీష్
X
ఏపీలో మూడు రాజధానుల ప్రకటన.. అమరావతిపై సంక్షోభం నేపథ్యంలో అక్కడి పరిస్థితులు తెలంగాణకు కలిసి వస్తాయని తెలంగాణ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో సంక్షోభ పరిస్థితుల వల్ల తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం పురోగమిస్తుందని హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరం అంటూ వ్యాఖ్యానించి దుమారం రేపారు. హైదరాబాద్ లో జరిగిన క్రెడాయ్ తెలంగాణ సమావేశంలో హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజధాని సమస్య మీద తెలంగాణలో ఏ నేత ఇప్పటివరకూ స్పందించలేదు. మంత్రి హరీష్ రావు మాత్రం నర్మగర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఏపీలో అల్లకల్లోలం కారణంగా ఐటీ ఉద్యోగులతోపాటు బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చాడు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో మెరుగ్గా ఉందన్నారు. చెన్నైలో మంచినీటి సమస్య, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య, ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో అధిక ధరలు ఉంటే హైదరాబాద్ లో ఎలాంటి సమస్యలూ లేవన్నారు.

హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. హరీష్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై ఏపీ అధికార, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది వేచిచూడాలి.