Begin typing your search above and press return to search.

మూడేళ్ల త‌ర్వాత కూడా ఇవే మాట‌లా హ‌రీశ్‌

By:  Tupaki Desk   |   16 Jun 2017 5:18 AM GMT
మూడేళ్ల త‌ర్వాత కూడా ఇవే మాట‌లా హ‌రీశ్‌
X
తెలంగాణ‌లో తాజాగా వెలుగు చూస్తున్న భూ అక్ర‌మాల విష‌యంలో తెలంగాణ అధికార‌ప‌క్ష ఫైర్ బ్రాండ్‌.. మంత్రి హ‌రీశ్ గ‌ళం విప్పారు. ఈ ఉదంతంలో ప‌లువురు అధికార పార్టీకి చెందిన నేత‌లు ఉన్నార‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. అందుకు త‌గ్గ‌ట్లే కొంద‌రి ఉదంతాలు తెర మీద‌కు వ‌స్తున్న వేళ హ‌రీశ్ నోరు విప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఉదంతం మీద మంత్రి కేటీఆర్‌.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించారు.

భూకుంభ‌కోణాల్ని ప్ర‌భుత్వ‌మే బ‌య‌ట‌పెట్టింద‌ని.. మీడియా కానీ మ‌రెవ‌రూ ఆ ప‌ని చేయ‌లేద‌ని.. అవ‌క‌త‌వ‌క‌ల్ని తెర మీద‌కు తెచ్చిన త‌మ‌ను అభినందించాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తే.. అస‌లు స్కాం అన్న‌దే లేద‌ని.. ప్ర‌భుత్వానికి రూపాయి కూడా న‌ష్టం వాటిల్ల‌లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తాజాగా వీరిద్ద‌రి మాట‌ల్ని క‌లిపి.. త‌న‌దైన శైలిలో మాట్లాడారు మంత్రి హ‌రీశ్‌. ఈ సంద‌ర్భంగా త‌న అమ్ముల‌పొదిలోని కొన్ని వ్యాఖ్య‌ల్ని బ‌య‌ట‌కు తీశారు. ఎప్ప‌టిలానే.. భూకుంభ కోణాల పాపం త‌మ‌ది కాద‌ని ద‌శాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. టీడీపీ ప్ర‌భుత్వాల పుణ్య‌మేన‌ని మండిప‌డ్డారు.

రాష్ట్రంలో భూ అక్ర‌మాల విష‌యంలో విప‌క్ష నేత‌ల‌తో స‌హా అంద‌రి చిట్టాలు బ‌య‌ట‌పెడ‌తామ‌ని.. ఎవ‌రినీ వ‌ద‌ల‌బోమ‌ని హ‌రీశ్ పేర్కొన్నారు. మియాపూర్ భూముల అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల విష‌యంలో ప్ర‌భుత్వ భూమి ఒక్క గ‌జం కూడా అన్యాక్రాంతం కాలేద‌న్నారు. ఖ‌జానాకు పైసా న‌ష్టం వాటిల్ల‌లేద‌ని.. కాంగ్రెస్‌.. టీడీపీలు ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌న్నారు. ఈ భూ దందాలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబ స‌భ్యులు ఉన్న‌ట్లుగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెబుతున్నార‌ని.. ఎవ‌రెవ‌రు ఉన్నారో చెప్పాల‌ని.. ఆధారాలు చూపాల‌ని స‌వాలు విసిరారు. ఒక‌వేళ‌.. ఉత్త‌మ్ తాను చేసిన ఆరోప‌ణ‌ల‌కు సాక్ష్యాలు చూపించ‌కుంటే అబిడ్స్ సెంట‌ర్లో ముక్కును నేల‌కు రాస్తారా? అని స‌వాలు విసిరారు.

ప్ర‌భుత్వానికి వ‌స్తున్న మంచిపేరును జీర్ణించుకోలేని విప‌క్షాలు.. ఏదో విధంగా దెబ్బ తీయాల‌న్న ఉద్దేశంతోనే ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. నిజాం హ‌యాంలోని జాగీరు భూముల‌ను అప్ప‌ట్లోనే త‌గిన ప‌రిహారం ఇచ్చేసి ప్ర‌భుత్వాలు స్వాధీనం చేసుకున్నాయ‌ని.. కానీ త‌ర్వాతి కాలంలో నిజాం వార‌సుల‌మ‌ని చెప్పుకుంటూ కొంద‌రు వివాదాల్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెప్పారు.

అప్ప‌టి కాంగ్రెస్‌.. టీడీపీ ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌టం వ‌ల్లే.. ఆ పాపాలు వార‌స‌త్వంగా వ‌చ్చాయ‌న్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టింది కేసీఆరేన‌ని.. మీడియానో.. ప్ర‌తిప‌క్షాలో కాద‌ని గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఓ ప‌క్క నిజాం హ‌యాంలోని జాగీరు భూముల‌ను గ‌తంలోని ప్ర‌భుత్వాలు త‌గిన ప‌రిహారం ఇచ్చేసి తీసుకున్న‌ట్లు చెబుతూనే.. అక్ర‌మాల్ని చెక్ చెప్పే విష‌యంలో నాటి ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌న్న రెండు ర‌కాల మాట‌ల్ని హ‌రీశ్ నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తి అయిన త‌ర్వాత‌.. ఏదైనా వైఫ‌ల్యాన్ని గ‌త ప్ర‌భుత్వాల మీద నింద వేసే కార్య‌క్ర‌మాన్ని హ‌రీశ్ వ‌దిలి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అధికారంలోకి వ‌చ్చిన ఏడాది వ‌ర‌కూ ఇలాంటి మాట‌లు బాగుంటాయ‌ని.. కానీ.. ఏళ్ల‌కు ఏళ్లు గ‌డుస్తున్నా.. త‌ప్పును మ‌రొక‌రిపైన వేసేలా వ్య‌వ‌హ‌రించ‌టం మంచిది కాద‌న్న మాట వినిపిస్తోంది. మొత్తానికి త‌మ త‌ప్పేం లేద‌ని.. అంతా విప‌క్షాల‌దేన‌న్న‌ట్లుగా మాట్లాడుతున్న హ‌రీశ్ మాట‌లు.. ప్ర‌తిపక్షాల చేత మ‌రిన్ని మాట‌లు మాట్లాడేలా చేస్తాయ‌న‌టంలో సందేహం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/