Begin typing your search above and press return to search.

రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై టీఆర్ ఎస్ వ్యూహం ఇది

By:  Tupaki Desk   |   21 Sep 2015 9:05 AM GMT
రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై టీఆర్ ఎస్ వ్యూహం ఇది
X
రైతు ఆత్మహత్యలు...తెలంగాణ‌లో ఇప్పుడు అట్టుడుకుతున్న అంశం. సాగులో స‌మ‌స్య‌లు చుట్టుముట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైత‌న్న‌లు అసువులు బాస్తున్నారు. ప్ర‌భుత్వం వారిని ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఇన్నాళ్లు ఆరోప‌ణ‌లు చుట్టుముట్టాయి. అయితే ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు రూ.6ల‌క్ష‌ల ప‌రిహారం అంద‌చేస్తామ‌ని తెలంగాణ కేబినెట్ ప్ర‌క‌టించింది. అయితే దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రైతుల సంఖ్య‌ను కావాల‌నే కుదిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టాయి. రెండ్రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో సీనియ‌ర్ మంత్రి , తెలంగాణ శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి టి హరీశ్‌ రావు ప్ర‌భుత్వ విధానాన్ని వెల్ల‌డించారు.

అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు అత్యంత బాధ‌క‌ర‌మ‌న్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లపై ప్రతిపక్షం కంటే ముందే తామే రైతు ఆత్మహత్యలపై సభలో ప్రకటన చేస్తామన్నారు. ప్రతిపక్షానికి ఎజెండా లేకుండా పోయిందని అందుకే రాద్దాంతం చేయాల‌ని చూస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వాళ్లే రైతుల గురించి ఎలా మాట్లాడుతారని ఆయ‌న ప్ర‌శ్నించారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని, శాసనసభ వేదికగా అన్ని ప్రజలకు వివరిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరిస్తారని హ‌రీశ్ రావు స్ప‌ష్టం చేశారు. రైతులను కాపాడడానికి రుణమాఫీ - గోడౌన్ల నిర్మాణం - చెరువుల పునరుద్ధరణ - నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేసామ‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. శాసన సభను వీలైనన్నీ ఎక్కువ రోజులు నిర్వహిస్తామ‌ని, ఈ ఏడాదిలో త‌మ ప్ర‌భుత్వం సాధించిన విజయాలు గురించి తెలంగాణ ప్రజలకు వివరిస్తామ‌ని తెలిపారు. అయితే ప్ర‌తిప‌క్షాలు ఉద్దేశ‌పూర్వకంగా ర‌చ్చ చేయాల‌ని చూస్తే తామేం చేయ‌గ‌ల‌మ‌ని ఆయ‌న చెప్పారు.