Begin typing your search above and press return to search.

కేసీఆర్ పరువు కాపాడిన హరీష్ రావు

By:  Tupaki Desk   |   1 May 2019 10:22 AM IST
కేసీఆర్ పరువు కాపాడిన హరీష్ రావు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరువును మేనల్లుడు హరీష్ రావు కాపాడారు. మామ కేసీఆర్ ఈ మధ్యకాలంలో అల్లుడు హరీష్ రావును పక్కనపెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. కొడుకు కేటీఆర్ కు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం.. అందలమెక్కించడంతో హరీష్ రావు ను సైడ్ చేస్తున్నారన్న ఆందోళన అంతటా వ్యాపించింది.

అయితే మామ కేసీఆర్ ఎంత దూరం పెట్టినా కానీ అల్లుడు మాత్రం కేసీఆర్ సొంత ఊరిలో మామ పరువు కాపాడారు. తాజాగా కేసీఆర్ స్వస్థలమైన చింతమడకలో పరిషత్ నామినేషన్ల సందర్భంగా టీఆర్ ఎస్ కు చిక్కు వచ్చిపడింది. టీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా రంగంలోకి దిగడానికి ప్రయత్నించారు అయితే ముఖ్యమంత్రి సొంతూరులో ప్రజల మధ్య ఐక్యత లేదంటే కేసీఆర్ కు ఇబ్బందే. అందుకే దీన్ని సవాల్ గా తీసుకున్న హరీష్ రావు వెంటనే రంగంలోకి దిగి టీఆర్ ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమయ్యేటట్లు చేశారు.

చింతమడక ఎంపీటీసీ సీటు మహిళకు రిజర్వ్ అయ్యింది. టీఆర్ ఎస్ నుంచి ఆర్.జ్యోతి తన అభ్యర్థిగా ప్రకటించింది. పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థి రంగంలోకి దిగారు. దీంతో హరీష్ రావు రంగంలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థిని ఉపసంహరింపచేశారు. ఇలా మామ పరువు కాపాడేందుకు అల్లుడు చేసిన ప్రయత్నం ఫలించింది. కేసీఆర్ ను విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఒక అస్త్రం లేకుండా హరీష్ రావు చక్రం తిప్పారు.