Begin typing your search above and press return to search.

కోటి న‌ష్ట‌మంటూ బాబును కొత్త‌గా టార్గెట్ చేసిన హ‌రీశ్‌

By:  Tupaki Desk   |   9 Oct 2018 3:35 PM GMT
కోటి న‌ష్ట‌మంటూ బాబును కొత్త‌గా టార్గెట్ చేసిన హ‌రీశ్‌
X
వార‌స‌త్వ‌ రాజ‌కీయాల ప్ర‌చారం - ప‌క్క‌కు పెట్టార‌నే కామెంట్లు...పార్టీపై అసంతృప్తులు అనే అంచ‌నాల కేంద్రంగా గ‌త కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ నేత‌, మంత్రిహ‌రీశ్‌రావు తాజాగా కొత్త అంశంతో మీడియా ముందుకు వ‌చ్చారు. పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఇటు ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు - తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ నాయ‌కుడు కోదండ‌రాం స‌హా కాంగ్రెస్ పార్టీపై మండిప‌డ్డారు. మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడికి 12 అంశాలతో కూడిన బహిరంగ లేఖ సందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడితో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలని లేఖలో ప్రధానంగా ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణను కేసీఆర్ నిలబెట్టాలనుకుంటే చంద్రబాబు పడగొట్టాలనుకుంటున్నారని అందులో భాగ‌మే మ‌హాకూట‌మి అని ఆరోపించారు. ``టీడీపీ నేరుగా వస్తే తెలంగాణలో డిపాజిట్లు దక్కవు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అది రుజువైంది. అందుకే చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నాడు. మహాకూటమి నేతల వ్యక్తిగత స్వార్ధం కోసమే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు` అని పేర్కొన్నారు. తెలంగాణ సామాన్య జనం మహాకూటమి ఏర్పాటును చీదరించుకుంటున్నారని హ‌రీశ్ రావు అన్నారు. ``కేసీఆర్ పదకొండు రోజుల దీక్షతో చావు నోటి దాకా వెళ్లారు. కేసీఆర్ చిత్తశుద్ధి ఆలా ఉంటే మహాకూటమి నేతలు పరాయి పాలనకు మొగ్గు చూపుతున్నారు. మాతో కలిసి ఉద్యమించిన కోదండరాం తెలంగాణ వ్యతిరేకులతో కలవడం అమరవీరుల ఆత్మలకు ద్రోహం చేయడం కాదా ? అప్పట్లో టీడీపీని జేఏసీ నుంచి సస్పెండ్ చేసింది కోదండరాం కాదా ? అదే పార్టీతో పొత్తా? కోదండరాం తాను ఎమ్మెల్యేగా గెలవడం కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడతారా`` అని హరీశ్ బహిరంగ లేఖ ద్వారా ప్రశ్నించారు.

- తెలంగాణ వ్యతిరేక వైఖరి వీడానని బాబు హామీ ఇచ్చారా? పోలవరం ఏడు మండలాలు తిరిగి ఇచ్చేస్తామని బాబు హామీ ఇచ్చారా?

- రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కూడా చంద్ర‌బాబు తెలంగాణ వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అదేమైనా మార్చుకున్నా అని టీడీపీ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారా?

- పోలవరం డిజైన్ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా?

- పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్దని బాబు కేంద్రానికి 30 లేఖలు రాశారు. బాబు వైఖరి మార్చుకుని మళ్ళీ కేంద్రానికి లేఖ ఇచ్చారా?

- కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖను బాబు వాపసు తీసుకున్నారా?

- కృష్ణా - గోదావరి జలాల్లో వాటాకు సంబంధించి ట్రిబ్యునళ్లలో జరుగుతున్న వాదనల విషయంలో చంద్రబాబు వైఖరి మార్చుకుంటున్నారా?

- తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల కృష్ణా జలాలను బాబు రాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ మీద మేము పోరాడుతున్నాం. తెలంగాణకు నీళ్లు వద్దంటున్న బాబుతో నీళ్లు ఇప్పిస్తామని చెప్పించగలరా?

- చంద్రబాబు తెలుగు జాతి అని మాట్లాడుతుంటారు. అది ఆయనకు అతకదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు ఉంటే మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లిచ్చే ప్రాజెక్టును బాబు వ్యతిరేకిస్తున్నారు. దానిపై ఆయన వైఖరి మారిందా?

- బీజేపీ మద్దతుతో 460 మెగావాట్ల సీలేరు హైడెల్ కేంద్రాన్ని బాబు లాక్కున్నారు. దాన్ని తెలంగాణకు బాబుతో తిరిగి ఇప్పిస్తారా? లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్లాంటును చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ నుంచి లాక్కోవ‌డంతో తెలంగాణ కరెంటో కోతలు అనుభవించింది. ఈ ప్రాజెక్టును కోల్పోవడంతో తెలంగాణ రోజుకు రూ. కోటి నష్టపోతోంది.

- త్రిశంకు స్వర్గంలో ఉన్న 1350 మంది ఉద్యోగులను ఏపీ తీసుకోవడానికి బాబును ఒప్పిస్తునారా?

- నిజాం వారసత్వంగా తెలంగాణకు సంక్రమించాల్సిన ఆస్తులపై బాబు వాదన ఏమైనా మార్చుకున్నారా?.

- హైకోర్టు - మిగతా విభజన హామీలపై బాబుతో హామీ తీసుకున్నారా?.