Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టే

By:  Tupaki Desk   |   26 July 2018 6:31 AM GMT
కాంగ్రెస్‌ కు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టే
X

టీఆర్ ఎస్ పార్టీ నేత‌ - మంత్రి హ‌రీశ్ రావు రాజ‌కీయాల్లో మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. కొద్దికాలం క్రితం వ‌ర‌కు త‌న ప్రాజెక్టులు, త‌న ముందున్న ల‌క్ష్యాల సాధ‌న త‌ప్ప మ‌రే విష‌యం ప‌ట్టించుకోని హ‌రీశ్ గ‌త కొద్దిరోజులుగా కీల‌క అంశాల‌పై స్పందిస్తున్నారు. ప్ర‌ధానంగా...కేంద్ర ప్ర‌భుత్వంపై టీడీపీ అవిశ్వాసం, ఆ సంద‌ర్భంగా చోటుచేసుకున్న ప‌లు ప‌రిణామాల నేప‌థ్యంలో హ‌రీశ్ చురుకుగానే స్పందిస్తున్నారు. తాజాగా ఆయ‌న మ‌ళ్లీ అవిశ్వాసం ఎపిసోడ్‌ పై రియాక్ట‌య్యారు. అధికారం కోసం కాంగ్రెస్ - టీడీపీలు ఒక్కటవుతున్నాయని మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది చంద్రబాబు టీడీపీకే వేసిన‌ట్ల‌ని హ‌రీశ్ పేర్కొన్నారు. ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆ రెండు పార్టీల దోస్తీ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని వివ‌రించారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో టీఆర్ ఎస్ సిద్దిపేట జిల్లా విద్యార్థి విభాగం నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ చెప్పినట్టుగా తెలంగాణ రాష్ర్టానికి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికమని పార్లమెంట్‌ లో టీడీపీ మాట్లాడుతుంటే.. అటువంటి పార్టీకి కాంగ్రెస్ నేతలు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ తెలంగాణ ప్రాజుక్టులకు అడ్డం పడుతున్నదని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు రద్దుచేయాలని చంద్రబాబు లేఖరాశారని.. రాత్రికి రాత్రే ఏడు మండలాలను ఏపీలో కలుపుకొని తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. అటువంటి చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలోని కాళేశ్వరం - పాలమూరు ఎత్తిపోత ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని హ‌రీశ్ రావు ప్రశ్నించారు. విభజనబిల్లులో ఈ అంశాన్ని ఎందుకు చేర్చలేదో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల్సిందేనని మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే సీఎం కేసీఆర్ మరో 20 ఏళ్ల‌ పాటు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. తెలంగాణ ఇంటి పార్టీని ప్ర‌జ‌లు ఆదరిస్తున్నార‌ని, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై త‌గు చైత‌న్యం క‌లిగించాల‌ని కోరారు.