Begin typing your search above and press return to search.

ఆ ఊరికి ద‌స‌రా.. దీపావ‌ళి.. బతుక‌మ్మ ఒకేసారి వ‌చ్చేశాయ‌ట‌

By:  Tupaki Desk   |   22 July 2019 5:05 PM IST
ఆ ఊరికి ద‌స‌రా.. దీపావ‌ళి.. బతుక‌మ్మ ఒకేసారి వ‌చ్చేశాయ‌ట‌
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆరా మ‌జాకానా? ఆయ‌న అనుకోవాలే కానీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు. కోరుకున్నంత‌నే.. కొండ మీద‌కెక్కిన కోతిని కిందికి దించేస్తారు. తాను పుట్టిన ఊరికి ముఖ్య‌మంత్రి హోదాలో వెళ్లిన కేసీఆర్ వ‌రాల వ‌ర్షం కురిపించారు. త‌న స్వ‌గ్రామ‌మైన చింత‌మ‌డ‌క‌లో అక్క‌డి గ్రామ‌స్తుల‌తో క‌లిసి ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హించిన సంద‌ర్భంగా.. త‌న ప్ర‌సంగంలో ప‌లు వ‌రాల్ని ప్ర‌క‌టించారు.

ఇదే విష‌యాన్ని సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు త‌న‌దైన రీతిలో చెబుతూ.. కేసీఆర్ రాక‌తో చింత‌లేని గ్రామంగా చింత‌మ‌డ‌క మారుతుంద‌న్నారు. ఆయ‌న రాక‌తో ద‌స‌రా.. దీపావ‌ళి.. బ‌తుక‌మ్మ పండుగ‌లు ఒకేసారి వ‌చినట్లుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ సాధ‌నలో భాగంగా సాగిన ఉద్య‌మంలో కేసీఆర్ కు చింత‌మ‌డ‌క బాస‌ట‌గా నిలిచింద‌న్నారు. ఆమ‌ర‌ణ దీక్ష స‌మ‌యంలో ఆ ఊరిలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెల‌గ‌లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. చింత‌మ‌డ‌క వాసుల‌తో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్ వ‌చ్చార‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆ ఊరికి అవ‌స‌ర‌మైన డిమాండ్ల చిట్టాను చ‌దివారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే..తాను పెట్ట‌ద‌లుచుకుంటే.. క‌డుపు నిండే వ‌ర‌కూ పెట్టే అల‌వాటున్న కేసీఆర్.. తాజాగా త‌న తీరును మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. చింత‌మ‌డ‌క‌కు రోడ్ల‌ను.. వెయ్యి నుంచి ప‌దిహేను వంద‌ల డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను.. భూగ‌ర్భ డ్రైయినేజీలు.. తాగునీరు.. చింత‌మ‌డ‌క ప‌రిస‌ర గ్రామాల‌కు ర‌హ‌దారుల కోసం అవ‌స‌ర‌మైన నిధుల్ని తామిస్తామ‌ని చెప్పారు.

జిల్లా క‌లెక్ట‌ర్ వ‌ద్ద నిధులు ఉంచుతామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. త‌న‌ను ఈ స్థాయికి తెచ్చిన చింత‌మ‌డ‌క రుణాన్ని తీర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. తానీ ఊరికి వ‌చ్చే ముందు ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిని పిలిచి.. ఊరికి పోతున్నాం.. ఉత్త చేతుల‌తో పోలేం క‌దా? ఎంత‌వ‌ర‌కూ హామీలు ఇవ్వొచ్చంటే.. ఆయ‌న రూ.400 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టొచ్చ‌ని.. తాను స‌ర్దుబాటు చేస్తాన‌ని చెప్పారంటూ.. వ‌రాల వర‌ద‌ను పాటించారు. ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా వ‌రాల్ని ప్ర‌క‌టించిన కేసీఆర్ మాట‌ల‌తో నిజంగానే ద‌స‌రా.. దీపావ‌ళి.. బ‌తుక‌మ్మ‌లు ఒకేసారి వ‌చ్చిన‌ట్లైంది.