Begin typing your search above and press return to search.

మాట‌ల్లో తేడా వ‌స్తున్న‌ట్లుందే హ‌రీశ్ భ‌య్‌!

By:  Tupaki Desk   |   5 Aug 2017 5:59 AM GMT
మాట‌ల్లో తేడా వ‌స్తున్న‌ట్లుందే హ‌రీశ్ భ‌య్‌!
X
తెలంగాణ అధికార‌పక్షంలో మాట‌గాళ్ల‌కు కొద‌వ‌లేదు. మాట‌ల‌తో మ‌న‌సుల్ని దోచుకునేటోళ్లు మ‌స్తుమంది ఉన్నారు. దీర్ఘ‌కాలం ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మంలో భాగ‌స్వామ్యం కావ‌టం.. నాటి అధికార‌ప‌క్షాల‌పై పోరాట‌మే ఊపిరిగా న‌డిపిన పుణ్య‌మా అని.. స‌బ్జెక్ట్ మీద ప‌ట్టున్నోళ్లు టీఆర్ ఎస్ లో చాలామందే క‌నిపిస్తారు.

గులాబీ బాస్ ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావ‌టం.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్ అధికారాన్ని అందివ్వ‌టం జ‌రిగిపోయాయి. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జ‌రుగుతున్న‌దంతా మ‌రో ఎత్తుగా చెబుతున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీఆర్ ఎస్ నేత‌ల మాట‌లు మారిన‌ట్లుగా ఈ మ‌ధ్య‌న విమ‌ర్శ‌లు ఎక్కువైపోతున్నాయి. ప‌వ‌ర్ పుణ్య‌మా అని ఏ చిన్న విమ‌ర్శ‌ను సైతం త‌ట్టుకోవ‌టానికి అధికార‌ప‌క్షం సిద్ధంగా లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఇలాంటి వేళ‌.. ఈ మ‌ధ్య‌నే మీడియాను కొలువు తీర్చి మ‌రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండు గంట‌ల‌కు పైనే మాట్లాడిన సంద‌ర్భంలో.. విప‌క్ష నేత‌ల్ని నా కొడుకులంటూ ఏసుకున్న తీరు చూసి చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. నా కొడ‌కా.. అన్న మాట‌ను ఎవ‌రెక్కువ ఉప‌యోగిస్తారు? ఎక్క‌డ ఉప‌యోగిస్తార‌న్న‌ది విడ‌మ‌ర్చి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. ఆ మాట‌ల్ని అదే ప‌నిగా విప‌క్ష నేత‌ల‌పై సీఎం కుర్చీలో కూర్చున్న నేత విరుచుకుప‌డ‌టం చూసిన వారికి నోట మాట రాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. అధినేత‌కు ఏ మాత్రం తీసిపోన‌ట్లుగా తాజాగా మంత్రి హ‌రీశ్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. విమ‌ర్శ‌ల్ని ధీటుగా తిప్పికొట్టాల్సిన వేళ‌లో.. సెల్ఫ్ గోల్ అన్న‌ట్లుగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు చూసి నోరెళ్ల‌బెట్టేస్తున్నారు.

మంచివ‌క్త‌గా.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు ఎంత‌కూ కొరుకుడుప‌డ‌ని నేత‌గా సుప‌రిచితుడైన హ‌రీశ్ లాంటి నేత నోటి నుంచి పొంత‌న లేని మాట‌లు రావ‌టం ఏమిట‌న్న విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. బోడిగుండుకు.. మోకాలికి లింకు పెట్టిన చందంగా ఆయ‌న పోల్చిన పోలిక ఏ మాత్రం స‌రిగా లేద‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. తాను మాట్లాడే మాట‌ల్లో వంక పెట్టేందుకు ఏ మాత్రం వీలు లేని రీతిలో ఉండే హ‌రీశ్ మాట‌ల్లోనూ లెక్క తేడా కొట్ట‌టం ఏమిట‌న్న సందేహం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది.

సిరిసిల్ల ద‌ళితుల్ని అరెస్ట్ చేసిన వారిపై పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని.. వారిని దారుణంగా హింసించిన వైనం మీడియాలో పెద్ద ఎత్తున వ‌చ్చింది. బాధితులే స్వ‌యంగా చెప్పుకున్న మాట‌ల నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు డిఫెన్స్ లో ప‌డింద‌న్న భావ‌న ప‌లువురిలో వ్య‌క్త‌మైంది. ఇలాంటి వేళ‌.. ఈ అంశంపై మంత్రి హ‌రీశ్ నోటి నుంచి వ‌చ్చిన వాద‌న వింటే అవాక్కు కావాల్సిందే.

ఎందుకంటే.. తెలంగాణ ఉద్య‌మ‌కారుల మీద నాటి స‌మైక్య‌రాష్ట్రంలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో హ‌రీశ్ పోల్చ‌టం గ‌మ‌నార్హం. నాడు ఉద్య‌మ‌కారుల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌లేదా? ఇదే సిరిసిల్ల‌లో ర‌హీమున్నీసాను జై తెలంగాణ అంటే చెప్పుల‌తో కొట్టించ‌లేదా? యాకూబ్ రెడ్డి అనే స‌ర్పంచ్ ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌లేదా? వీట‌న్నింటికి కాంగ్రెస్ కార‌ణం కాదా? అంటూ ప్ర‌శ్నిస్తున్న హ‌రీశ్‌.. అస‌లేం చెప్పాల‌నుకుంటున్నారు? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

అలాంటి త‌ప్పులు చేసినందుకే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ కు ప్ర‌జ‌లు శిక్ష విధించార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. తెలంగాణ ప్ర‌జ‌లు సుదీర్ఘ స్వ‌ప్న‌మైన ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఆ పార్టీని వ‌దిలేసి టీఆర్ ఎస్‌ కు ప‌వ‌ర్ ను క‌ట్ట‌బెట్టారంటే కార‌ణం.. కాంగ్రెస్ వారి అరాచ‌కాల్ని భ‌రించ‌లేక‌నే. అలాంట‌ప్పుడు.. నాడు జ‌రిగిన అరాచ‌కాల్ని ప్ర‌శ్నించ‌టం ద్వారా.. ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో జ‌రిగాయ‌న్న సందేహాన్ని ఇచ్చేలా హ‌రీశ్ మాట‌లు ఉన్నాయ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని త‌ప్పు ప‌ట్టే వేళ‌లో.. వారిని విమ‌ర్శించ‌టంలో త‌ప్పు లేదు. కానీ.. మీరు అప్పుడు చేయ‌లేదా? అంటూ ప్ర‌శ్నించ‌టం ద్వారా.. మీరు అప్పుడు చేశారు.. మేం ఇప్పుడు చేస్తున్నామ‌న్న సందేశాన్ని ఇచ్చిన‌ట్లుగా ఉంటుంద‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు వెళుతుంద‌న్న విష‌యాన్ని హ‌రీశ్ ప‌ట్టించుకోక‌పోవ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మాట‌ల విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే హ‌రీశ్ లాంటి నేత నోటి నుంచి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు స‌రికావ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏమైనా.. హ‌రీశ్ భ‌య్యా.. పోలిక‌ల విష‌యంలో ఎక్క‌డో ప‌ట్టు త‌ప్పుతోంద‌న్న‌ట్లుగా అనిపిస్తోంది. కాస్త క్రాస్ చెక్ చేసుకోవ‌టం మంచిదేమో?