Begin typing your search above and press return to search.

ఆంధ్రా పార్టీలు జై అంటేనేగా తెలంగాణ వచ్చింది

By:  Tupaki Desk   |   17 Nov 2015 4:16 AM GMT
ఆంధ్రా పార్టీలు జై అంటేనేగా తెలంగాణ వచ్చింది
X
ఆత్మరక్షణలో పడిన ప్రతిసారీ సెంటిమెంట్ ను బయటకు తీయటం గులాబీ దళానికి మామూలే. వరంగల్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో తమ అమ్ములపొదలోని సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు టీఆర్ఎస్ నేతలు. ఎన్నికల వేళ.. పార్టీలకు ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టేసి.. టోకుగా ప్రయోజనం పొందాలన్న వ్యూహాన్నిగులాబీ దళం ఇప్పుడు మరోసారి ప్రయోగించాలని భావిస్తోంది.

ఇందులో భాగంగానే మంత్రి హరీశ్ మాటలు ఉండటం గమనార్హం. తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ముమ్మూటికి ఆంధ్రా పార్టీలేనని వ్యాఖ్యానించటం దీనికి నిదర్శనం. ఈ రెండు పార్టీలను ఆంధ్రాపార్టీలుగా అభివర్ణించిన హరీశ్.. ఈ రెండు పార్టీలు ‘‘జై తెలంగాణ’’ అంటే ఓకే అని వ్యాఖ్యానించారు. రాజకీయంగా రెండు పార్టీల్ని విరుచుకుపడాలని భావించిన ప్రతిసారీ ఆంధ్రా బ్రాండ్ అంటూ దుమ్మెత్తి పోసే హరీశ్ అండ్ కోలు.. నిజంగా ఈ రెండు పార్టీలు కానీ ఆంధ్రా పార్టీలు అయితే.. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం ఎందుకు తీసుకుంటాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ పార్టీలు తమ అంగీకారాన్ని తెలుపుతూ లేఖ రాయటాన్ని మర్చిపోకూడదు. నిజానికి ఈ ప్రక్రియలో అందరికంటే ముందు ఉన్నది తెలుగుదేశం పార్టీనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము పూర్తిస్థాయిలో బలపరుస్తామని తెలుగుదేశం పార్టీ తమ అభిప్రాయాన్ని విస్పష్టంగా కేంద్రానికి లేఖ రాసిన తర్వాతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం మరింత జోరుగా సాగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

హరీశ్ రావు ఆరోపించినట్లుగా తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రా పార్టీనే అయి ఉంటే.. తెలంగాణ ఏర్పాటుకు తమ అంగీకారాన్ని రాతపూర్వకంగా తెలుపుతూ కేంద్రానికి లేఖ రాసి ఉండేది కాదు కదా? తెలంగాణ సాధనలో తెలుగుదేశం పార్టీ కీలకభూమిక పోషించిన సమయంలో గుర్తుకు రాని ఆంధ్రా బ్రాండ్.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు కనిపించిందో అర్థం కాని విషయం.

నిజానికి తెలుగుదేశం పార్టీ.. ఆంధ్రా పార్టీనే అయి ఉంటే.. తెలంగాణ సాధనలో ఆంధ్రా పార్టీ సాయాన్ని టీఆర్ఎస్ నేతలు ఎందుకు తీసుకునేవారు? తెలంగాణకు తాము అనుకూలమన్న విషయాన్ని కేంద్రానికి తెలుపుతూ లేఖ రాయాలని ఎందుకు ఒత్తిడి తెచ్చినట్లు? తమకు అనుకూలంగా వ్యవహరించే సమయంలో కనిపించని ‘ఆంధ్రా బ్రాండ్’ ఎన్నికల సమయంలోనూ.. రాజకీయంగా దెబ్బ తీసే సమయంలో మాత్రమే టీఆర్ఎస్ నేతలకు ఎందుకు కనిపిస్తుందో..?