Begin typing your search above and press return to search.

హరీశ్ వాదన ఎప్పుడూ ఒక్కటే...

By:  Tupaki Desk   |   19 Nov 2015 5:30 PM GMT
హరీశ్ వాదన ఎప్పుడూ ఒక్కటే...
X
తెలంగాణ రాష్ట్ర సమితి కష్టాల్లో ఉన్నప్పుడు.. తాము ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదుతున్నప్పడు.. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని అనుకున్నప్పుడు.. తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు వాదన ఎప్పుడూ ఒకటే.. ఆయన ఒకే విషయం మాట్లాడుతూ ఉంటారు. అదే.. ఆంధ్రా బాబు.. ఆంధ్రా పెత్తనం.

నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ వాదనతోనే హరీశ్ రావు పాపులర్ అయ్యారు. అప్పట్లో చంద్రబాబును విమర్శించడం ద్వారా తెలంగాణవాదులకు దగ్గరయ్యారు. అయితే, హరీశ్ పప్పులు ఇప్పుడు ఉడకటం లేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు తెలంగాణ వాదం లేదు కనక. మహబూబ్ నగర్ ఎన్నికలు వచ్చినా.. వరంగల్ ఎన్నికలు వచ్చినా.. జీహెచ్ ఎంసీ ఎన్నికలైనా హరీశ్ రావు ఆంధ్రా బాబు - ఆంధ్రా పెత్తనం అనే వాదనను తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వరంగల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఆత్మరక్షణలో ఉండడంతో టీడీపీని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. టీడీపీ - బీజేపీ మధ్య దూరం పెంచాలని పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రా బాబు విజయవాడ నుంచి డైరెక్షన్ ఇస్తున్నారని, ఆంధ్రా పెత్తనం తెలంగాణలో చెల్లదని విమర్శలు గుప్పించారు. వాస్తవానికి, వరంగల్ ఎన్నికల ప్రారంభం నుంచీ ఆయన ఇదే వాదన చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన విమర్శలకు ప్రజలు ఎంతో భావోద్వేగంతో స్పందించేవారు. కానీ, తెలంగాణ సాకారం కావడంతో ప్రజలు అస్సలు స్పందించడం లేదు.

తెలంగాణలో ప్రస్తుతం కాస్తంత క్రెడిబులిటీ ఉన్న నాయకుడు హరీశ్ రావు మాత్రమే. ఆయన ఆంధ్రా పిడి వాదంతో ఇలాగే ముందుకు వెళితే మిగిలిన నాయకుల కోవలోకి ఆయన కూడా చేరిపోవడం ఖాయమని టీఆర్ ఎస్ నాయకులే ఆందోళన చెందుతున్నారు.