Begin typing your search above and press return to search.

మావాళ్లు త‌లుచుకుంటే రోజులో ల‌క్ష కేసులు

By:  Tupaki Desk   |   21 Jun 2015 11:26 AM GMT
మావాళ్లు త‌లుచుకుంటే రోజులో ల‌క్ష కేసులు
X
తెలంగాణ అధికార‌ప‌క్షం టీఆర్ ఎస్ పార్టీకి చెందిన టీ న్యూస్ ఛాన‌ల్ కు ఏపీ స‌ర్కారు నోటీసులు ఇవ్వ‌టంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌జ‌లు కానీ త‌లుచుకుంటే ఒక రోజులోనే ల‌క్ష కేసులు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా న‌మోదు చేస్తార‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ ఉద్య‌మంలో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌కుండా అడ్డుకున్న‌ది చంద్ర‌బాబే అంటూ ప‌లువురు యువ‌కులు త‌మ ప్రాణాలు తీసుకున్నార‌ని.. వారు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేట‌ప్పుడు వారి చేతి రాత‌తో రాసిన సూసైడ్ లెట‌ర్స్ లో చంద్ర‌బాబు పేరు ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించిన విష‌యాన్ని గుర్తు చేశారు.
కేసుల్లోకి ఇరుక్కొని.. అడ్డదిడ్డంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఇప్పుడు త‌మ‌పై వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును త‌ప్పు ప‌ట్టారు. తెలంగాణ‌లోని ప్ర‌తి జిల్లాలోనూ ఆంధ్రా ప్ర‌జ‌లు ఉన్నార‌ని.. వారంద‌రి రక్ష‌ణ బాధ్య‌త‌లు చంద్ర‌బాబు తీసుకుంటారా? అని ప్ర‌శ్నించిన హ‌రీశ్‌.. అద‌న‌పు బ‌ల‌గాల్ని హైద‌ర‌బాద్‌లో ఉంచ‌టం స‌రికాద‌న్నారు.
తన‌ను తాను నిప్పుగా చెప్పుకునే చంద్ర‌బాబు.. నిప్పు కాద‌ని.. తుప్పు అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో నిందితులైన మ‌త్త‌య్య‌.. ఎమ్మెల్యే సండ్ర‌ల‌ను ఏపీలో దాచి పెట్టార‌ని.. నిందితుల్ని దాచి పెట్టే సంస్కృతి ఏమిట‌ని ప్ర‌శ్నించారు. హ‌రీశ్ రావు విరుచుకుప‌డిన వైనం చూసిన‌ప్పుడు.. ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛాన‌ల్ కు నోటీసులు ఇవ్వ‌టంపై చాలా తీవ్రంగా హ‌ర్ట్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ అధికార‌ప‌క్షంగా.. త‌మ ప్రాంతంలో త‌మ‌కే నోటీసులు ఇవ్వ‌టాన్ని జీర్ణించుకోవ‌టం కాస్త క‌ష్ట‌మే మ‌రి.